తెలంగాణ ఫిల్మ్ డెలవప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు సోమవారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సమావేశం కానున్నారు. విజయవాడలో గేమ్ ఛేంజర్ ఫ్యాన్స్ ఈవెంట్ కోసం వచ్చిన ఆయన తాను పవన్ ను కలవబోతున్నట్లుగా ప్రకటించారు. గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు పవన్ ముఖ్యఅతిథిగా రానున్నారు. పవన్ కల్యాణ్ వెసులుబాటును బట్టి తేదీ ఖరారు చేయనున్నారు.
దిల్ రాజు భేటీలో చాలా అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంది. తెలంగాణలో బెనిఫిట్ షోలు, టిక్కెట్ రేట్ల పెంపు ఉండదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖరాఖండిగా చెబుతున్నారు. ఏపీలోనూ ప్రభుత్వం అదే పద్దతి పాటిస్తే సంక్రాంతి సినిమాలకు కలెక్షన్లు పడిపోతాయి. గేమ్ ఛేంజర్ మీద దిల్ రాజు చాలా పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు ఆయన టెన్షన్ లో ఉన్నారు. తాను తెలంగాణలో ఎఫ్డీసీ చైర్మన్ కాబట్టి ఆ సమయానికి ఎలాగోలా పర్మిషన్లు తెచ్చుకోవాలని అనుకుంటారు. ఆయన తెచ్చుకుంటే తమకూ వర్తిస్తుందని ఇతర నిర్మాతలు దిలాసాగా ఉన్నారు. అంటే మొత్తం భారం దిల్ రాజుపైనే పడిందన్నమాట.
ఏపీలో టాలీవుడ్ కు ఎలాంటి సమస్యలు లేవు. పుష్ప సమయంలో అంత పెద్ద మొత్తంలో రేట్లు పెంచడానికి ప్రభుత్వం ముందూ వెనుకాడింది . కానీ ఒత్తిడి తెచ్చి పెంచుకున్నారు. అల్లు అర్జున్ సినిమాపై వివక్ష చూపిస్తున్నారన్న ప్రచారం జరుగుతుందని.. ఆ సమస్య ఎందుకులే అని ప్రభుత్వ పెద్దలు కూడా అంగీకరించారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా పెంపునకు అనుమతి ఇచ్చింది.దాంతో తప్పలేదు. సంక్రాంతి సినిమాల విషయంలో ఎలాంటి విధానం అవలభిస్తారో నిర్మాతలకు అర్థంకావడం లేదు. దిల్ రాజు ఈ సమస్యపైనా చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు.