పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఒక్క సినిమా ఈవెంట్ లోనూ పాలు పంచుకోలేదు. ఆ అవకాశం `గేమ్ ఛేంజర్` రూపంలో దక్కబోతోంది. రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన `గేమ్ ఛేంజర్` జనవరి 10న రాబోతోంది. ఈ సందర్భంగా భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు నిర్మాత దిల్ రాజు. ఆంధ్రాలో ఈ ఈవెంట్ చేయాలన్నది ఆయన ఆలోచన. అందుకు ఏర్పాట్లు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. ఏపీలో గేమ్ ఛేంజర్ ఈవెంట్ జరిపి, పవన్ కల్యాణ్ రాకపోతే ఎలా? అందుకే పవన్ ని చీఫ్ గెస్ట్ గా ఈ ఈవెంట్ కి ఆహ్వానించారు దిల్ రాజు. పవన్ ఇచ్చిన డేట్ ని బట్టి వెన్యూ, టైమ్ ఫిక్స్ చేస్తామని దిల్ రాజు చెప్పారు.
అవి.. ఇప్పుడు ఫిక్సయిపోయాయి. జనవరి 4న ఈవెంట్ కి వస్తానని పవన్ కల్యాణ్ మాట ఇచ్చారని తెలుస్తోంది. రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ప్లాన్ చేశారు. గేమ్ ఛేంజర్‌కు సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలు రాజమండ్రిలో చిత్రీకరించారు. అందుకే రాజమండ్రి వేదిక గా ఫిక్సయ్యింది. రాజమండ్రిలో ఓ సినిమా వేదిక ఇంత భారీ ఎత్తున జరగబోతుండడం ఇదే తొలిసారి. కాబట్టి అన్ని విధాలా ఈ ఈవెంట్ ప్రాధాన్యతను సంతరించుకొన్నట్టే.
దిల్ రాజు – పవన్‌ల మధ్య సినిమా పరిశ్రమకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా ఈ మీటింగ్ లో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకొన్న సంగతి తెలిసిందే. ఈ మీటింగ్ గురించి కూడా పవన్ అడిగి తెలుసుకొన్నారని సమాచారం. త్వరలోనే ఏపీలోనూ ఇలాంటి సమావేశం ఒకటి ఏర్పాటు చేసే అవకాశం ఉంది. బహుశా సంక్రాంతి తరవాత.. ఈ మీటింగ్ ఉండొచ్చు.