2017 సంక్రాంతి రేసు మామూలుగా ఉండేట్టు లేదు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున చిత్రాలు సంక్రాంతి బరిలో దిగబోతున్నాయి. నాగార్జున కాస్త తటపటాయించినా చిరు, బాలయ్యలు మాత్రం బాక్సాఫీసుని ఢీ కొట్టడానికి రెడీ అంటున్నారు. అయితే..వీటి మద్య దిల్ రాజు కూడా ‘నేను సైతం’ అంటూ సమర శంఖం ఊదేస్తున్నాడు. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రం శతమానం భవతి. సతీష్ వేగ్నేశ దర్శకుడు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు దిల్‌రాజు ప్రకటించాడు.
బొమ్మరిల్లు చిత్రానికి పదేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని శతమానం భవతి చిత్రాన్ని ఈరోజు హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించారు. నాలుగు నెలల్లో ఈ సినిమాని పూర్తి చేసి, సంక్రాంతి బరిలో నిలుపుతున్నట్టు ప్రకటించారు కూడా. సంక్రాంతికి పెద్ద చిత్రాలు బరిలో దిగుతుంటే.. దిల్‌రాజు ఎంతకింత ధైర్యం చేయాలనుకొంటున్నాడో అర్థం కావడం లేదు. ఎంత దిల్‌రాజు సినిమా అయినా.. ఎదురుగా ఉన్నది చిరు, బాలయ్యలు. వాళ్లతో పోటీ పడితే ఏం జరుగుతుందో తెలియంది కాదు. అయితే దిల్‌రాజు ప్లాన్ వేరుగా ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్య్యా ఏ సినిమా ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు పూర్తవుతుందో చెప్పడం కష్టమైపోయింది. ఆఖరి క్షణాల్లో సినిమా విడుదల తేదీలు వాయిదా పడుతున్నాయి. అలాంటి అవకాశం తనకీ వస్తే.. రెండు సినిమాల్లో ఏ ఒక్కటి తప్పుకొన్నా.. వెంటనే తన సినిమాని విడుదల చేసి, సంక్రాంతి సీజన్‌ని క్యాష్ చేసుకోవాలన్నది దిల్‌రాజు ఐడియా. అందుకే అంత ధైర్యం చేస్తున్నాడని చిత్రసీమ వర్గాలు గుసగుసలాడుకొంటున్నాయి.