సినిమా సమీక్షలు రాసేవాళ్లన్నా, వెబ్ సైట్లన్నా దర్శక నిర్మాతలకు ఓరకమైన భావం ఉంది. సినిమా బాగుందని రాసినంత కాలం… రివ్యూవర్లు మంచోళ్లే. బాలేదు అంటే మాత్రం సినిమా పరిశ్రమకు వాళ్లే చీడపురుగులు. కానీ… సినిమా మంచి చెడులు బేరీజు వేయడానికి రివ్యూలు సహాయపడతాయని కొద్ది మంది నిర్మాతలు నమ్ముతారు. రివ్యూవర్ల కోణం కూడా ఒకటి ఉంటుందని, వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సినిమా చూడడం కూడా అవసరమని నమ్మే నిర్మాత దిల్ రాజు. అందుకే ఆయన రివ్యూ రైటర్లకు ఓ ఆఫర్ ఇచ్చారు. సినిమా తీసే ముందు రివ్యూ రైటర్లకు స్క్రిప్టు ఇస్తానని, ఆ స్క్రిప్టుని రివ్యూ చేసి ఇవ్వాలని, అలా.. సినిమాలో భాగం పంచుకోవాలంటూ ఆహ్వానించారు.
దిల్ రాజు కొత్తగా దిల్ రాజు డ్రీమ్స్ అనే సంస్థకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ ద్వారా యేడాదికి ఐదు చిత్రాలు నిర్మించాలన్నది ధ్యేయం. కొత్త నిర్మాతలకు ఓ వేదిక కల్పించాలనే ప్రయత్నంలో భాగంగా స్థాపించిన సంస్థ ఇది. ఈ సంస్థలో రూపొందించే చిత్రాలకు సంబంధించిన స్క్రిప్టు విషయంలో రివ్యూ రైటర్లని భాగం చేయాలని దిల్ రాజు భావిస్తున్నారు.”సినిమా చూశాక రివ్యూ ఇవ్వడం కాదు. ముందే రివ్యూ ఇస్తే తప్పొప్పుల్ని చెక్ చేసుకొనే అవకాశం ఉంటుంది. అలా… కొత్త దర్శకుల్ని, నిర్మాతల్నీ ప్రోత్సహించడంలో రివ్యూ రైటర్లు కూడా భాగం కావొచ్చు. అలాగని రివ్యూలన్నీ రైటే అనడం లేదు. వాళ్లకు నచ్చని సినిమాలు కూడా ఆడుతున్నాయి. కానీ రివ్యూ రైటర్ల పాయింట్ ఆఫ్ వ్యూ లోంచి కూడా సినిమా చూడడం అవసరం” అన్నారాయన. నిజానికి ఇది చాలా మంచి ఆలోచన. ముందే కొన్ని తప్పొప్పుల్ని ట్రిమ్ చేసుకొనే అవకాశాలు ఉన్నాయి. అలాగని ఓ రివ్యూ రైటర్ చేయి వేస్తే.. సినిమా భవిష్యత్తు మారిపోతోందనో, గొప్ప కథలు వస్తాయనో కాదు. కనీసం తప్పులు తగ్గుతాయి. అంతే. మరి ఈ ఆలోచన ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి.