టాలీవుడ్ లో త్వరలో షూటింగులు ఆగిపోతాయని, నిర్మాతలంతా బంద్ ప్రకటించే అవకాశం ఉందని రెండు మూడు రోజుల నుంచీ.. తీవ్రమైన చర్చ జరుగుతోంది. దానికి అనుగుణంగానే నిర్మాతలంతా కలిసి ఓ మీటింగ్ పెట్టుకొని – ఈ విషయంపై సాధ్యాసాధ్యాలను చర్చిస్తున్నారు. ముందు సోమవారం నుంచి బంద్ అన్నారు. ఆ తరవాత ఆగస్టు 1 నుంచి బంద్ అంటున్నారు. దీనిపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు తొలిసారి నోరు విప్పారు.
”నిర్మాతలంతా కలిసి మాట్లాడుకుంటున్న మాట వాస్తవం. అయితే బంద్ గురించి ఇంకా మేం ఏమీ అనుకోలేదు. మీడియానే ఫలానా రోజున బంద్ అట… అని ఏవేవో రాస్తోంది. మేం బంద్ గురించి ఇంకా మాట్లాడుకోలేదు. ఇండస్ట్రీని ఎలా కాపాడుకోవాలన్న చర్చ మాత్రం సాగుతోంది. ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకొన్నా నిర్మాతలంతా ఒక తాటిపైకే వస్తారు. ఎందుకంటే ఇది నిర్మాతల సమస్య కాదు. మొత్తంగా చిత్రసీమే.. ఇబ్బందుల్లో పడే ప్రమాదం కనిపిస్తోంది. నిర్మాత నష్టపోతే… తనొక్కడే పోడు. తన వల్ల.. హీరోలు, నటీనటులు, టెక్నీషియన్లు ఇలా అందరి జీవితాలూ నష్టాల్లో పడతాయి. నిర్మాతల బాధల్ని హీరోలు, టెక్నీషియన్లు అర్థం చేసుకుంటారని మా నమ్మకం. ఓ సినిమా ఆపాలంటే, నిర్మాత హీరోలతో, దర్శకులతో మాట్లాడాలి. దానికి కొంత సమయం పడుతుంది” అని క్లారిటీ ఇచ్చారు.
ఆగస్టు 1 నుంచి షూటింగులకు బంద్ అనే ప్రతిపాదన ఉంది. అయితే.. ఈ నిర్ణయం తీసుకోవడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న సినిమాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయా సినిమాలు ఆగిపోతే, వడ్డీల మోత మోగిపోతుంది. అలాగని కొత్తగా మొదలయ్యే సినిమాల్ని ఆపేయాలని చెబితే అది అసలు బంద్కిందే రాదు. కొన్ని సినిమాలు ఎలాగూ జరుగుతుంటాయి కాబట్టి… షూటింగులు ఆగిపోతే వచ్చే సమస్యలు… కార్మికులకు, హీరోలకు పూర్తి స్థాయిలో అర్థం కావు. కాబట్టి.. ఈ నిర్ణయాన్ని అంత తేలిగ్గా తీసుకోలేకపోతున్నారు.