తెలుగులో అగ్ర శ్రేణి నిర్మాతగా చలామణీ అవుతున్నారు దిల్‌రాజు. పంపిణీరంగంలో ఇది వరకే తనదైన ముద్ర వేశారాయన. చిన్న, పెద్ద, స్టార్, కొత్త.. ఇలా ఎలాంటి సినిమా అయినా తీయగల సమర్థుడు. నిర్మాణ రంగంలో దిల్ రాజు ఓ బెంచ్ మార్క్. ఇప్పుడాయన దృష్టి బాలీవుడ్‌పై పడింది. ఎఫ్ 2 రీమేక్‌తో దిల్ రాజు బాలీవుడ్లో అడుగుపెట్టబోతున్నారు. ఈలోగా.. మరో సినిమానీ హిందీలో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాని నిర్మాతగా రూపొందిన `హిట్` చిత్రాన్ని ఆయన హిందీలో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. చూస్తుంటే… దిల్ రాజు బాలీవుడ్లో కూడా తనదైన గుర్తింపు సంపాదించడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్టు అర్థమౌతోంది.
నిజానికి మన నిర్మాతలు బాలీవుడ్లో పాగా వేయడానికి ఇది సరైన సమయం. ఎందుకంటే `పాన్ ఇండియా` సినిమాలకు తెలుగు సినిమా ప్రస్తుతం కేరాఫ్ గా నిలుస్తోంది. ఓ పెద్ద హీరోతో సినిమా మొదలైతే..దానికి పాన్ ఇండియా ఇమేజ్ తీసుకురావడం సర్వసాధారణమైన విషయం అయిపోయింది. అలాంటి సినిమాల్ని బాలీవుడ్లో అమ్ముకోవాలంటే నిర్మాణ సంస్థలకు అక్కడ కూడా తనదైన ఇమేజ్ ఉండాలి. లేదంటే అక్కడి నిర్మాణ సంస్థతో భాగస్వామ్య వ్యాపారం చేయాలి. హిందీలోనూ ఒకట్రెండు సినిమాలు చేస్తే, అక్కడి ప్రొడక్షన్ హౌస్ తో చేతులు కలిపితే.. బాలీవుడ్ మార్కెట్ పై ఓ స్పష్టమైన అవగాహన వస్తుంది. అక్కడ వ్యాపార లావాదేవీలు నిర్వహించడం తేలిక అవుతుంది. అందుకే… మన నిర్మాతల దృష్టి క్రమంగా బాలీవుడ్ పై పడుతోంది. ఆ ప్రయత్నంలోనే దిల్ రాజు బాలీవుడ్ సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. భవిష్యత్తులో మరింత మంది నిర్మాతలు ఈ తరహా ప్రాజెక్టులు ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.