దిల్ రాజు సినిమాలన్నీ వంద, రెండొందల కోట్ల రేంజ్లోనే ఉంటున్నాయి. చిన్న సినిమాల్ని పట్టించుకొనేంత తీరిక లేదు. పైగా ఇప్పుడు శంకర్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా బడ్జెట్ ఇంకా ఎక్కువే. ఇలాంటి సమయంలోనూ… `బలగం` లాంటి సినిమాని భుజాన వేసుకొన్నాడు దిల్ రాజు. ఇది కమర్షియల్ సినిమా కాదు. ఆర్ట్ సినిమా లాంటిది. ఈ విషయం దిల్ రాజుకి తెలుసు. పెట్టిన డబ్బులు వెనక్కి వస్తాయన్న గ్యారెంటీ లేదు. కానీ ఈ సినిమా కోసం.. తన కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి.. జనంలోకి తీసుకెళ్లడానికి ఓ కొత్త నిర్మాతలా అహోరాత్రులు కష్టపడ్డాడు. నిజానికి ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ లో.. దిల్ రాజుకి ఈ సినిమాని మోయాల్సిన పని లేదు. కానీ.. `తెలంగాణ` సెంటిమెంట్ తనని బలంగా లాగింది. `బలగం` తెలంగాణ ఆత్మని, సంస్కృతినీ ఆవిష్కరించిన సినిమా. అక్కడే దిల్ రాజు లాక్ అయ్యాడు. ఇలాంటి కథని జనంలోకి తీసుకెళ్లాల్సిందే అని నిర్ణయించుకొన్నాడు, పది రోజుల ముందే ప్రీమియర్స్ వేశాడు. కేటీఆర్, తలసాని లాంటి వాళ్లని ప్రమోషన్లకు తీసుకొచ్చాడు. తన వల్ల ఎంతైతే అంతా చేశాడు.
నిర్మాత ఏం చేసినా డబ్బుల కోసమే. కాకపోతే… ఇక్కడ దిల్ రాజు డబ్బులకు కూడా లొంగలేదు. ఈ సినిమాని డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేయాలంటూ చాలా ఆఫర్లు వచ్చాయి. చిత్ర బృందం కూడా అదే నమ్మింది. ఓటీటీలో విడుదల చేస్తే… థియేటర్లకు జనం వస్తారా, రారా? అనే బెంగ ఉండదు. పైగా.. నిర్మాతగా ముందే సేఫ్ అయిపోవొచ్చు. కానీ.. దిల్ రాజు ఆ సంగతీ పక్కన పెట్టాడు. ఈ సినిమాని జనం చూసినా, చూడకపోయినా థియేటర్లలోనే విడుదల చేస్తానంటూ పట్టుపట్టి కూర్చున్నాడు. డబ్బుల కోసం ఆలోచించకుండా..నిజాయితీగా చేసిన ప్రయత్నమిది. ఓరకంగా చిన్న సినిమాలకు మరింత ఊతం ఇచ్చింది. భవిష్యత్తులో దిల్ రాజు బ్యానర్ నుంచి ఇలాంటి ప్రయోగాత్మక, విలువైన చిత్రాలు మరిన్ని వచ్చే అవకాశాలున్నాయన్న సంకేతాల్ని బలగం అందించింది. ఈ సినిమాతో దిల్ రాజు ఏం సంపాదించాడు అనేది ప్రశ్నే కాదు. ఈ సినిమాతో చాలామంది నటీనటులు, సాంకేతిక నిపుణుల భవిష్యత్తుకు బంగారు బాట దొరికింది. ఈ విషయంలో దిల్ రాజుని మెచ్చుకొని తీరాల్సిందే.