శంకర్ – కమల్ హాసన్‌ల అద్భుతం.. భారతీయుడు. ఈ సినిమాకి సీక్వెల్ తీసే అవకాశం దిల్‌రాజుకి వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. దాదాపు రూ.200 కోట్లతో ఈ సినిమా తీస్తున్నామని దిల్‌రాజు ఘనంగా చెప్పాడు. కానీ… చివరికి ఈ సినిమా లైకా ప్రొడక్షన్స్ చేతుల్లోకి వెళ్లింది. ఈ సినిమా వదులుకోవడానికి గల కారణాల్ని దిల్ రాజు ముక్కుసూటిగానే చెప్పారు. `ఈ సినిమా చేయడం రిస్క్` అని తన సన్నిహితులు సలహా ఇచ్చారని, తెలుగులో తనకు నచ్చిన సినిమాల్ని, తనకిష్టం వచ్చినట్టు తీసుకుంటున్న తరుణంలో తమిళంలోకి వెళ్లి అక్కడ సినిమా తీయాల్సిన అసవరం లేదనిపించిందని, పైగా స్క్రిప్టు విషయంలోనూ కలగ చేసుకొనే అవకాశం శంకర్ దగ్గర ఉండదనిపించి ఈసినిమా వదులుకున్నానని దిల్‌రాజు చెబుతున్నాడు. అయితే అన్నింటికి మించి ఏఎం రత్నం దిల్‌రాజుని ఎక్కువగా భయపెట్టాడన్నది నిజం. భారతీయుడు సినిమాని ఆయనే నిర్మాత. తన అనుమతి, భాగస్వామ్యం లేకుండా `భారతీయుడు2` ఎలా తీస్తారన్నది అతని వాదన. దాంతో భారతీయుడు 2 అనే పేరైనా మార్చాలి, లేదంటే ఈ సినిమాలో రత్నంకి వాటా అయినా ఇవ్వాలి. ఎందుకులే లేనిపోని రిస్కు అనుకుని… దిల్‌రాజు ఈ ప్రాజెక్టు నుంచి డ్రాప్ అయ్యాడు. అన్నింటికి మించి రూ.200 కోట్లు ఒంటిచేత్తో సర్దడం మాటలు కాదు. ఇవన్నీ గమనించే దిల్‌రాజు ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేశాడు. మరి ఈ నిర్ణయం సరైనదేనా? కాదా?? అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.