థియేటర్ల మాపియా విషయంలో వేడి రాజుకుంది. ‘పేటా’ సినిమాకి సరైన థియేటర్లు ఇవ్వలేదని, ఈ విషయంలో మాఫియా రాజ్యమేలుతోందని, వాళ్లనందరినీ నయీంని కాల్చి పారేసినట్టు కాల్చేయాలని.. సంచలన వ్యాఖ్యలు చేశారు `పేటా` నిర్మాత వల్లభనేని అశోక్. దీనిపై దిల్రాజు స్పందించారు. కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చారు. సంక్రాంతికి తెలుగు నుంచి మూడు పెద్ద సినిమాలొస్తుంటే, ఓ అనువాద చిత్రానికి థియేటర్లు ఎలా దొరుకుతాయని అనుకుంటున్నారు? అని ప్రశ్నించారు. మూడు నెలల క్రితమే.. సంక్రాంతి సినిమాలు పక్కా అయ్యాయని, ఇప్పటికిప్పుడు వచ్చి డబ్బింగ్ సినిమాకి కూడా థియేటర్లు కావాలని అడగడంలో న్యాయం లేదని చెప్పుకొచ్చారు దిల్ రాజు.
”నోటికొచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. మేమూ మాట్లాడగలం. కానీ నాకు క్యారెక్టర్ ఉంది. నేను దిగజారలేను. ఇక్కడ మనం చేస్తోంది వ్యాపారం. పంపిణీలో ఈమధ్య నాకు చాలా నష్టాలొచ్చాయి. కానీ సినిమాపై అభిరుచితో.. సినిమాలు తీస్తున్నాం. ఆరు నెలల క్రితం ప్రకటించిన సినిమాలకు థియేటర్లు ఉండాలా, వద్దా? మూడు సినిమాలూ క్రేజీ సినిమాలే. ఎన్టీఆర్ బయోపిక్ ప్రతిష్టాత్మక చిత్రం. రామ్చరణ్ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఎఫ్ 2 ఓ క్రేజీ సినిమా. ఇలాంటి తెలుగు సినిమాల్ని తగ్గించుకుని డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు ఇవ్వలేం కదా? ఈసీజన్కి డబ్బింగ్ సినిమాలు థియేటర్లు ఇవ్వలేం. 18 వరకూ ఆగితే.. రెండు రాష్ట్రాల్లోనూ థియేటర్లు దొరుకుతాయి కదా? ఇదంతా అర్థం చేసుకుని మాట్లాడితే మంచిది. గతంలో ఈ నిర్మాత `సర్కార్` అనే డబ్బింగ్ సినిమా విడుదల చేశారు. ఆ సినిమాకి కావల్సిన సంఖ్యలో, కావల్సిన చోట థియేటర్లు దొరికాయి. అప్పుడు దొరికి, ఇప్పుడు దొరకలేదు అంటే అర్థమేమిటి” అంటూ ప్రశ్నించారు దిల్రాజు.