నిర్మాత దిల్ రాజుకు ఈ సంక్రాంతి మిశ్రమ ఫలితాల్ని అందించింది. తన బ్యానర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘గేమ్ చేంజర్’ డిజాస్టర్ లిస్టులో చేరిపోయింది. ఈ సినిమాతో దిల్ రాజుకు దాదాపు రూ.200 కోట్ల వరకూ నష్టం రావొచ్చన్నది ఇన్ సైడ్ వర్గాల మాట. దిల్ రాజు కెరీర్లోనే ఇది పెద్ద దెబ్బ. సినిమా ఎంతో పెద్ద హిట్ అయితే తప్ప రూ.20 కోట్ల లాభం చూడలేరు నిర్మాతలు. అలాంటిది రూ.200 కోట్లు పూడ్చుకోవడం అంటే మాటలు కాదు. ఇంత పెద్ద ఫ్లాప్ ఏ నిర్మాతకు వచ్చినా వీధిన పడడం ఖాయం. కానీ… దిల్ రాజు అదృష్టం ఏమిటంటే, అదే సంక్రాంతికి మరో హిట్ చూసేశారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో.
సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని రూ.55 కోట్లతో పూర్తి చేశారు. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో దాదాపు రూ.40 కోట్లు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ వీకెండ్ లాంగ్ రన్ ఎలాగూ వుంది. దాన్ని బట్టి, ఈ సినిమాతో దిల్ రాజు సంపాదించే లాభాల్ని అంచనా వేయొచ్చు. గేమ్ చేంజర్తో పోయిందల్లా సంక్రాంతికి వస్తున్నాం సినిమా తిరిగి ఇవ్వకపోవొచ్చు. కాకపోతే… ఈ సినిమాతో దిల్ రాజుకు పెద్ద రిలీఫ్ దొరికినట్టైంది.
శంకర్ స్కూల్ వేరు. ‘నేను తీసిందే సినిమా. ఈ విషయంలో ఎవరి జోక్యం అనవసరం. నిర్మాతతో సహా’ అనుకొనే పద్ధతి. అందుకే దిల్ రాజు పెట్టుబడి పెట్టారు కానీ, క్రియేటీవ్ విషయాల్లో తల దూల్చలేకపోయారు. అనిల్ రావిపూడితో దగ్గరుండి తన సినిమాని తనకు కావాల్సినట్టు తీయించుకొనే స్వేచ్ఛ దిల్ రాజుకు ఉంది. అయినా సరే, అనిల్ పై నమ్మకంతో సినిమా మొత్తాన్ని దర్శకుడిపైనే వదిలేశారు. గేమ్ చేంజర్ విషయంలో శంకర్ దిల్ రాజుని ముంచేస్తే – అనిల్ రావిపూడి ఆయన్ని ఒడ్డున పడేశాడు.
తన నిర్మాతల్ని ఎప్పుడూ సేఫ్ జోన్లో ఉంచాలన్నది అనిల్ రావిపూడి ఆలోచన. అందుకే పరిమితమైన బడ్జెట్లో, అందుబాటులో ఉన్న కాల్షీట్లతో ఓ సూపర్ హిట్ సినిమాని తన నిర్మాతకు అందించగలిగాడు. వెంకటేష్ కెరీర్లోనే ది బిగ్గెస్ట్ హిట్ అందించగలిగాడు. ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం.. ఇలా వెంకీతో హ్యాట్రిక్ కొట్టాడు. బాలయ్య – బోయపాటి అనగానే ఎంతటి భరోసా కలుగుతుందో, వెంకీ – రావిపూడి కాంబో మనసులోకి రాగానే అంతటి నమ్మకం ప్రేక్షకుల్లో కలిగేలా చక్కటి విజయాల్ని ఇవ్వగలిగాడు.