అనుకొన్నదే అయ్యింది. ఈ సంక్రాంతికి రావాల్సిన ‘విశ్వంభర’ వాయిదా పడింది. ఆ స్థానంలో ‘గేమ్ ఛేంజర్’ వస్తోంది. ‘గేమ్ ఛేంజర్’ కోసమే ‘విశ్వంభర’ని వాయిదా వేసినట్టు, అందుకు చిరంజీవికి, యూవీ క్రియేషన్స్ కు కృతజ్ఞతలు అంటూ దిల్ రాజు డిక్లేర్ చేసేశారు. నిజానికి ‘గేమ్ ఛేంజర్’ డిసెంబరులో రావాలి. డిసెంబరు 20న కానీ, క్రిస్మస్ రోజున కానీ సినిమాని రిలీజ్ చేస్తామని దిల్ రాజు ఘంటాపథంగా చెప్పేవారు. కానీ అప్పటికి సినిమా అవుట్ పుట్ రెడీగా ఉంటుందా, లేదా? అనేది పెద్ద అనుమానం. పైగా ఆ నెలలో ‘పుష్ష 2’ వస్తోంది. రెండు సినిమాల మధ్య పెద్ద గ్యాప్ లేదు. డిసెంబరు ఓ రకంగా బ్యాడ్ సీజన్ అని టాలీవుడ్ నమ్ముతుంది. డిసెంబరు ఆఖర్లో సినిమాలు పెద్దగా రాణించిన దాఖలాలు లేవు. అప్పటికే టాలీవుడ్ అంతా సంక్రాంతి వైబ్ మొదలైపోతుంది. అందుకే ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతికి వస్తే బాగుంటుందన్నది దిల్ రాజు అభిప్రాయం.
ఇదే విషయాన్ని చిరంజీవి, యూవీ క్రియేషన్స్ ముందుకు తీసుకెళ్లారు. మూడేళ్ల నుంచి గేమ్ ఛేంజర్ ని రెడీ చేస్తున్నామని, సంక్రాంతికి వస్తే, ఆర్థికంగా వెసులు బాటు ఉంటుందని, విశ్వంభర తప్పుకొంటే ఆస్థానంలో రావడానికి సిద్ధంగా ఉన్నామంటూ తన సాధకబాధకాలు చెప్పుకొన్నారు దిల్ రాజు. చిరంజీవి కూడా తాను సంక్రాంతి పోటీ నుంచి తప్పుకోవడానికి ఒప్పుకొన్నారు. యూవీ క్రియేషన్స్ కూడా సరే అంది. అలా… దిల్ రాజుకి రూట్ క్లియర్ అయ్యింది. ”గేమ్ ఛేంజర్ ని క్రిస్మస్ కి విడుదల చేద్దామనుకొన్నాం. కానీ క్రిస్మస్ కంటే, సంక్రాంతికి విడుదల చేయడం లాభసాటిగా ఉంటుందని నా డిస్టిబ్యూటర్లు అభిప్రాయ పడ్డారు. ఇదే విషయం చిరంజీవి, యూవీ క్రియేషన్స్ ముందుకు తీసుకెళ్లాం. ‘విశ్వంభర’ షూటింగ్ పూర్తయ్యింది. విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే మా అభ్యర్థన మన్నించి, వాళ్లు సినిమాను పెద్ద మనసుతో వాయిదా వేయడానికి ఒప్పుకొన్నారు. ఈ విషయంలో చిరంజీవిగారికీ, యూవీకి కృతజ్ఞతలు” అని దిల్ రాజు ఓ ప్రకటనలో తెలిపారు.