కుటుంబ ప్రేక్షకులకు ‘శ్రీనివాస కళ్యాణం’ నచ్చుతోందని మరోసారి దిల్‌రాజు గట్టిగా చెప్పారు. శని, ఆది వారాల్లో థియేటర్లకు కుటుంబ ప్రేక్షకులే ఎక్కువ వచ్చారని, వాళ్లు చిత్రాన్ని ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నామని అన్నారు. చిత్రానికి లభిస్తున్న ఆదరణ పట్ల సంతోషంగా వున్నామని తెలిపారు. ఈ సంతోషంలో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ముచ్చటగా మూడో చిత్రాన్ని ప్రకటించారు.
‘శ్రీనివాస కళ్యాణం’ విజయోత్సవ వేడుకలో దిల్‌రాజు మాట్లాడుతూ “సతీష్ వేగేశ్న దర్శకత్వంలో మా సంస్థలో ‘థాంక్యూ’ అని ఓ సినిమా చేయబోతున్నా. ‘మీకు ఎలా చెప్పాలో’ అనేది ఉపశీర్షిక. ‘శ్రీనివాస కళ్యాణం’లో వినోదం, యువతను ఆకట్టుకునే అంశాలు ఏవైతే మేం మిస్ అయ్యామని అనుకుంటున్నారో… అవన్నీ ‘థాంక్యూ’లో వుంటాయి. ఒక మనిషి జీవితానికి సంబంధించిన కథ ఇది” అన్నారు. అన్నట్టు… ఈ చిత్రానికి కథ సతీష్ వేగేశ్నది కాదు. ఎవరో తెచ్చిన కథ దిల్‌రాజుకి నచ్చడంతో అతడి చేతిలో పెట్టారు. దిల్‌రాజు ప్రకటించడమే ఆలస్యం… ‘థాంక్యూ’ మీద నితిన్ కర్చీఫ్ వేశాడు. “సతీష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తా. అది ‘థాంక్యూ’యే అనుకుంటున్నా. ఇదే కాంబినేషన్లో వెంటనే హిట్ కొడితే ఆ కిక్కే వేరప్పా” అని నితిన్ చెప్పాడు.