చిత్రసీమలో సెంటిమెంట్లపై సెంటిమెంట్ ఎక్కువ. ఏదైనా ఓ ఆనవాయితీ మొదలైతే అది కంటిన్యూ అవుతుంటుంది. దాన్ని బ్రేక్ చేయడం అంటే మాటలు కాదు. మరీ ముఖ్యంగా యాంటీ సెంటిమెంట్లకు ఇక్కడి జనాలు భయపడుతుంటారు. ‘వాళ్లతో పనిచేస్తే ఫ్లాపే’ అనే టాక్వస్తే… ఇక వరుసగా ఫ్లాపులే చుట్టుముడుతుంటాయి. అలానే దిల్రాజునీ ఓ సెంటిమెంట్ పీడిస్తోంది. ఆయన తాను పని చేసిన దర్శకులతో మళ్లీ పని చేస్తే… హిట్టు అందుకోవడం లేదు. భాస్కర్‌తో తీసిన బొమ్మరిల్లు… దిల్‌రాజు సంస్థ పేరుని నిలబెట్టింది. పరుగు ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. హరీష్ శంకర్‌తో ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ తీశాడు. అది హిట్టయ్యింది. ఆ తరవాత వచ్చిన ‘డీజే’ ఫ్లాప్ అయ్యింది. సతీష్ వేగ్నేశతో తీసిన ‘శతమానం భవతి’ హిట్టు. ఆ వెంటనే వచ్చిన ‘శ్రీనివాస కల్యాణం’ ఘోరంగా డిజాస్టర్ అయిపోయింది. త్రినాథరావు నక్కినతో తీసిన `ఎంసీఏ` మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ‘హలో గురు ప్రేమ కోసమే’ కేవలం యావరేజ్ మార్క్ దగ్గర ఆగిపోయింది. దిల్‌రాజుకి వరుసగా రెండు విజయాల్ని ఇచ్చింది అనిల్ రావిపూడినే. ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’ రెండూ వినోదాన్ని నమ్ముకుని విజయాన్ని అందుకున్నాయి. మూడో ప్రయత్నంగా వస్తున్న ‘ఎఫ్ 2’ ఏమవుతుందో చూడాలి.