హారిక హాసిని, మైత్రీ, సురేష్ మూవీస్, యువి , గీతా ఆర్ట్స్ ఇవన్నీ టాలీవుడ్ లో బడా సంస్థలే. కానీ వేదికల మీద వీటి అధినేతలు ఎప్పుడన్నా ఎక్కువ తక్కువ మాట్లాడడం విన్నారా? హారిక హాసిని చినబాబు వేదిక ఎక్కడమే అరుదు. మైత్రీ మూవీస్ అధినేతలు అదే టైపు. యువి వంశీ మాటే వినపడదు. సురేష్ మూవీస్ సురేష్ బాబు మాట్లాడతారు కానీ నిర్మాతగా ఎంత వరకో అంత వరకే. వీళ్లే కాదు, ఇంకా బడానిర్మాతలు బివివిఎస్ఎన్ ప్రసాద్ ఇలా చాలా మంది వున్నారు. ఎవ్వరూ వేదికల మీద అధిక ప్రసంగం చేయరు
కానీ నిర్మాత దిల్ రాజు వ్యవహారం అలా కాదు. రాను రాను ఆయన ఏం మాట్లాడుతున్నారో, ఆయనకే తెలియనట్లు వుంది వ్యవహారం. అసలు ఆయన సినిమాలు అంటే ఆయనే అంతా, డైరక్టర్లది, హీరోలదీ ఏమీ లేదు, అన్నట్లు మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడడంలో ఆయన పరిథులు కూడా దాటిపోతున్నారు
మొన్నటికి మొన్న హీరో రాజ్ తరుణ్ అస్సలు ఏమీ కాదు, ఫ్లాపుల్లో వున్నాడు, అసలు హీరోనే కాదు అన్నట్లు తీసిపారేసారు. ఆ తరువాత శ్రీనివాస కల్యాణం ఆడియో ఫంక్షన్ లో నితిన్ లాంటి హీరోని పట్టుకుని, ఫ్లాపుల్లో వున్నాడు, ఆదుకోమని ఇంటికి వచ్చి అడిగాడు అంటూ తనకు తోచింది మాట్లాడేసారు. సినిమా కథ , కీలక సన్నివేశాలు తనవే అన్నట్లు, అసలు ఐడియా తనదే అన్నట్లు, తిరుమల కొండ పై ఉండగా వచ్చిన ఐడియాస్ అన్నీ దర్శకుడు సతీష్ కి చెప్పి తీయించినట్టూ ఇలా ఆయన చిత్తానికి వచ్చింది మాట్లాడేసారు. వేదిక మీద వున్నవారు ఆయన ముందు ముసి ముసి నవ్వులు నవ్వి వుండొచ్చు. కానీ వెనుక మాత్రం ఇది ఏమీ బాగాలేదని విమర్శిస్తున్నారు.అంత క్రియేటివిటీ ఉంటే కధా సహకారం అనో, రచనా సహకారం అనో , టైటిల్స్ లో వేసుకొని తన టాలెంట్ చూపిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదుగా అనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి.
ఇప్పటికే పెద్ద దర్శకులు ఎవ్వరూ దిల్ రాజు బ్యానర్ లో సినిమాలు చేయడం లేదు.వంశీ పైడిపల్లి తప్ప మరో చెప్పుకోదగ్గ డైరక్టర్ తో సినిమా లేదు. ఇలా మాట్లాడడం ఆపకపోతే, హీరోలు, డైరక్టర్లు దొరకడం కష్టం అవుతుందేమో?