ఇటివలే ‘తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్’ గా బాధ్యతలు చేపట్టిన నిర్మాత దిల్ రాజు ఛైర్మన్ హోదాలో అల్లు అర్జున్ ఇష్యూ పై తొలిసారిగా మీడియాతో మాట్లాడిన తీరు ఆసక్తికరంగా వుంది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి అండగా ఉంటామని ఆయన ప్రకటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను దిల్ రాజు పరామర్శించారు.
సంధ్య థియేటర్ ఘటన ఎవరూ కావాలని చేసింది కాదు. ప్రమాదవశాత్తు జరిగింది. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు దిల్ రాజు. అమెరికా నుంచి రాగానే ముఖ్యమంత్రిని కలిశా, అల్లు అర్జున్ను త్వరలోనే కలుస్తా, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తున్నా. దానికి త్వరలోనే సమన్వయ పరిచడానికి, సమసిపోయేలా చేయడానికి, ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తానని ఆయన చెప్పడం ఆసక్తికరంగా వుంది.
ఇదే సందర్భంలో బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా ఆడుకోవడం తన భాద్యతగా ప్రకటించారు దిల్ రాజు. రేవతి భర్త భాస్కర్‌కు ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇదే సమయంలో మీడియాని సంయమనం పాటించమని కోరారు.
ఎలాంటి సమస్యలు రాకుండా చూసే బాధ్యత నాపై ఉందని చెప్పిన దిల్ రాజు…తర్వలోనే సమస్యని సమసిపోయేలా ప్రయత్నం చేస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాటల్లో చాలా వరకూ ముఖ్యమంత్రి గారితో జరిగిన కమ్యునికేషన్ ని చెబుతున్నానని పదేపదే చెప్పడం గమనార్హం.
నిజంగాఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ హోదాలో దిల్ రాజు ఈ సమస్య సమసిపోయేలా చేస్తే బన్నీకి, బన్నీ ఫ్యాన్స్ కి అంతకుమించిన విషయం మరొకటి వుండదు.