శుక్రవారం విడుదలైన ఎఫ్ 3 క్రమంగా హిట్ బాటలో చేరిపోయింది. తొలిరోజు రకరకాల టాక్స్ వినిపించినా – చివరికి జనం ఎఫ్ 3 వినోదానికి ఓటేశారు. మూడు రోజుల వసూళ్లు ఉత్సాహభరితంగా ఉన్నాయి. ఓ విధంగా టికెట్ రేట్ల విషయంలో దిల్ రాజు అనుసరించిన స్ట్రాటజీ వర్కవుట్ అయ్యిందనే చెప్పాలి. `సాధారణ టికెట్ రేట్లకే సినిమా` అంటూ దిల్ రాజు వినూత్న ప్రచారం చేశారు. టికెట్ రేట్లు పెరగడం వల్ల జనాలు థియేటర్లకు రావడం లేదని, సామాన్య ప్రేక్షకులకు సినిమా అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో… దిల్ రాజు ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఇది మంచి ఫలితాన్ని అందించిందనే అనిపిస్తోంది. `సర్కారు వారి పాట`, `ఆచార్య` సినిమాతో పోలిస్తే… `ఎఫ్ 3` రేట్లు గణనీయంగా తగ్గాయి. తగ్గిన రేట్లు.. ఎఫ్ 2 ఫ్రాంచైజీపై ఉన్న నమ్మకం, ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా అనే భరోసా కలగడంతో.. కుటుంబ ప్రేక్షకులు థియేటర్ల దారి పట్టారు. సోమవారం నుంచి ఈ వసూళ్లు ఎలా ఉంటాయి? అనే దాన్ని బట్టి…. ఎఫ్ 3 ఆర్థిక విజయం ఆధారపడి ఉంటుంది. వచ్చే వారం `మేజర్` వస్తోంది. ఈ సినిమాకి కూడా రేట్లు తగ్గించేశామని నిర్మాతలు ఇది వరకే చెప్పారు. ఇదే ఫార్ములా కమల్ హాసన్ `విక్రమ్` సినిమాకీ పాటించొచ్చు. చూస్తుంటే.. ఇక రాబోయే సినిమాలన్నీ దిల్ రాజు స్ట్రాటజీనే ఫాలో అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.