‘నా జోలికొస్తే… తాట తీస్తా..’
– దిల్ రాజు ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది. ఈరోజు.. ఓ చిన్న సినిమా ప్రెస్ మీట్ కి వెళ్లి, సడన్ గా తనపై పడుతున్న రాళ్లని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు దిల్ రాజు. ఆయనలో మీడియా కానీ, సినిమా వాళ్లు కానీ ఇంత ఆక్రోశం చూళ్లేదు. ఇంత స్ట్రాంగ్ వార్నింగులు వినలేదు. సంక్రాంతి సినిమాల్లో ‘హనుమాన్’కి థియేటర్లు రాకుండా అడ్డుకొంటున్నది దిల్ రాజే అనే ప్రోపకాండ గట్టిగా జరుగుతున్న నేపథ్యంలో, ‘హనుమాన్’ ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి మాట్లాడిన మాటలకు వక్ర రాతలు జోడించిన సందర్భంలో… దిల్ రాజు నుంచి వచ్చిన ఫైనల్ వార్నింగ్ ఇది.
దిల్ రాజు ఆవేదనలో, ఆక్రందనలో అర్థం ఉంది. ఎందుకంటే.. చిత్రసీమలో ఎప్పుడు థియేటర్ల గొడవ వచ్చినా అందరి వేళ్లూ దిల్ రాజువైపే వెళ్తాయి. ముఖ్యంగా సంక్రాంతి సినిమాల సీజన్లో. ఈసారీ అదే జరిగింది. విచిత్రం ఏమిటంటే ఈసారి దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక్క సినిమా కూడా రావడం లేదు. కేవలం ఆయన డిస్టిబ్యూషన్ చేస్తున్నారంతే. ఓ సినిమా కొనుక్కొన్న పంపిణీదారుడిగా, తన సినిమా ఎక్కువ థియేటర్లలో విడుదల కావాలని అనుకోవడంలో దిల్ రాజు తప్పేం లేదు. ఈ విషయాన్ని ఆయన చాలా స్మూత్ గా హ్యాండిల్ చేయాలనే చూశారు. మరీ ముఖ్యంగా ‘హనుమాన్’ దర్శక నిర్మాతల్ని పిలిపించి, 14వ తేదీన సినిమా వస్తే బాగుంటుందన్న సలహా మాత్రమే ఇచ్చారు. నిర్మాతగా, పంపిణీదారుడిగా ఇంత అనుభవం ఉన్న దిల్ రాజు ఇలాంటి సలహా ఇవ్వడంలో పెడర్థాలు వెదుక్కోవాల్సిన అవసరం ఏం లేదు. పైగా బరిలో ఉన్న ‘ఈగల్’ చిత్రాన్ని సదరు నిర్మాతతో, హీరోతో మాట్లాడి వాయిదా వేయించారు. ఓ పెద్ద సినిమాని ఇలా సంక్రాంతి బరి నుంచి తప్పుకొనేలా చేయడం సామాన్య విషయం ఏం కాదు. పైగా… ఈ మొత్తం వ్యవహారంలో నిర్మాతలందరి తరపునా మాట్లాడిన వ్యక్తి దిల్ రాజు మాత్రమే.
అన్నింటికంటే ముఖ్యమైన విషయం హనుమాన్ సినిమా ఎట్టిపరిస్థితుల్లోనూ 12నే విడుదల కావాలి. దానికి మరో మార్గం లేదు. ఎందుకంటే నార్త్ లో వాళ్లకు మంచి థియేటర్లు దొరుకుతున్నాయి. తెలుగులో ఓ 100 థియేటర్లు తక్కువైనా.. మాకు పర్వాలేదు.. అనుకొనే హనుమాన్ టీమ్ రిస్క్ చేస్తోంది. నైజాంలో థియేటర్ల సమస్య కేవలం హనుమాన్ కే లేదు. నాగార్జున, వెంకటేష్ సినిమాలకూ ఉంది. హైదరాబాద్ లో ఈ రెండు సినిమాలకూ హనుమాన్ కంటే తక్కువ థియేటర్లు దొరికాయి. దానికి కూడా కారణం.. దిల్ రాజునే అనుకొంటే ఎలా..?
హనుమాన్ ప్రీ రిలీజ్ లో దిల్ రాజు గురించి చిరంజీవి మాట్లాడిన మాటల్లో పాజిటీవ్ సెన్స్ ఉంది. ఎలాంటి వివాదాలకూ చోటు ఇవ్వకూడదన్న ఉద్దేశంతో చిరంజీవి చాలా ప్రశాంతంగా మాట్లాడారు. చివరికి ఆ మాటల్నీ వక్రీకరించి, నెపం తనపై నెట్టడంతో..దిల్ రాజు సహనాన్ని పరీక్షించినట్టైంది. తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఓ వర్గానికి దిల్ రాజు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశారు. ఇకపై థియేటర్ల గోల వచ్చిన ప్రతీసారీ దిల్ రాజుని ఆడిపోసుకొనేవాళ్లంతా.. ఇప్పటికైనా సైలెంట్ అవుతారో, లేదో?