ఎంత కాదన్నా.. సినిమా ప్రభావం చాలానే ఉంటుంది. ఓ మంచి సినిమా చూసినప్పుడు ప్రేక్షకుడు తప్పకుండా భావోద్వేగానికి గురవుతాడు. కొంతకాలం పాటు ఆ ఎమోషన్ తనలో క్యారీ అవుతుంది. సినిమా చూసిన వాళ్లకే కాదు.. తీసిన వాళ్లకు సైతం అలాంటి ఎమోషన్లే ఉంటాయి. అందుకు దిల్ రాజు ఓ పెద్ద ఉదాహరణ.
దిల్ రాజు నిర్మాతగా ‘థ్యాంక్యూ’ అనే సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఈనెల 22న విడుదల అవుతోంది. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన ఓ వ్యక్తి… ఆ ప్రయాణంలో తనకు సహాయపడినవాళ్లందరినీ కలిసి, థ్యాంక్యూ చెప్పుకొందామనుకుంటాడు. ఆ ప్రయాణంలో ఎదురైన అనుభవాలే.. థ్యాంక్యూ కథ. ఈ కథ దిల్ రాజుని బాగా కదిలించింది. అందుకే.. తన సినిమా ప్రయాణంలో తనకు సహాయపడినవాళ్లందరికీ థ్యాంక్య్ చెప్పుకొంటూ ఆయన ఓ ప్రయాణం మొదలెట్టారు. దిల్ రాజు నిర్మాతగా 50 చిత్రాలు పూర్తి చేశారు. ఈ 50 చిత్రాల ప్రయాణంలో… తనకు అత్యంత ఆప్తులు, తన ఉన్నదికి దోహదం చేసినవాళ్లందరినీ దిల్ రాజు కలుస్తున్నారు. దాన్ని ఓ వీడియో రూపంలో నిక్షిప్తపరుస్తున్నారు. అంటే ఇది దిల్ రాజు `థ్యాంక్యూ` అన్నమాట. ఓరకంగా థ్యాంక్యూకి సీక్వెల్ అనుకోవచ్చు. ఇప్పటి వరకూ ఆయన సగం మందికి మాత్రమే థ్యాంక్స్ చెప్పారు. మిగిలిన వాళ్లందరరినీ వీలైనంత త్వరగా కలుసుకొని, ఆ వీడియోని త్వరలోనే విడుదల చేద్దామని దిల్రాజు ప్లాన్ చేస్తున్నారు.