ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలకమైన పదవి కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎఫ్.డి.సి (ఫిల్మ్ డవలప్మెంట్ కార్పొరేషన్) ఛైర్మన్గా దిల్ రాజును ఎంపిక చేయొచ్చన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే ఓ కీలకమైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. గత కొన్నేళ్లుగా ఎఫ్.డి.సి కార్యకలాపాలు స్తబ్దుగా ఉన్నాయి. ఈ విభాగాన్ని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. నిర్మాతగా అపారమైన అనుభవం ఉన్న దిల్ రాజుకి ఈ పదవి అప్పగిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నది ఆయన అభిప్రాయం.
ఇటీవల రేవంత్ రెడ్డి – దిల్ రాజు మధ్య భేటీ జరిగింది. వీరిద్దరి మధ్య ఎఫ్.డి.సికి సంబంధించిన అంశం ప్రస్తావనకు వచ్చిందని, ఛైర్మన్గా ఉండమని రేవంత్ రెడ్డి స్వయంగా దిల్ రాజుని కోరారని తెలుస్తోంది. అయితే దిల్ రాజు కాస్త తటపటాయిస్తున్నారని, ఈ బాధ్యత నెత్తిమీద వేసుకొంటే, దానికి ఎంత సమయం కేటాయించగలనా? ఓ వైపు సినిమాలతో, మరోవైపు ఫిల్మ్ ఛాంబర్ వ్యవహారాలతో తలమునకలై, ఇప్పుడు ఎఫ్.డి.సి ఛైర్మన్ పదవికి న్యాయం చేయగలనా, లేదా? అనే మీమాంశతో తర్జన భర్జనలు పడుతున్నారని తెలుస్తోంది. నిజానికి ఎఫ్.డీ.సీ ఛైర్మన్ అనేది చిన్న పదవేం కాదు. టాలీవుడ్ కు సంబంధించిన అనేక విషయాలు ఎఫ్.డి.సితో ముడి పడి ఉంటాయి. దిల్ రాజులాంటి వాళ్లు ఆ పదవిలో కూర్చుంటే తప్పకుండా మంచి ఫలితాలే చూడొచ్చు. ఈ విషయమై అతి త్వరలోనే ఓ స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.