నాగార్జున, నాగచైతన్యలు కలసి `మనం`లో సందడి చేశారు. వీరిద్దరూ మరోసారి కలసి నటించబోతున్నారా?? అవుననే అంటున్నాయి చలన చిత్ర వర్గాలు. నాగార్జున, నాగచైతన్యలతో కలసి దిల్‌రాజు ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల శతమానం భవతి చిత్రంతో హిట్ కొట్టిన సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని దిల్‌రాజు కూడా చూచాయిగా అంగీకరించారు. ”నాగ్, చైతూలతో కలసి ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అన్నీ కుదిరితే.. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుంది” అంటున్నారు దిల్‌రాజు.
తన సంస్థలో ఎవరైనా ఓ సినిమా చేసి హిట్ కొడితే… మరో సినిమా ఆఫర్ చేయడం దిల్‌రాజుకి అలవాటు. అలా.. సతీష్‌కి ఈ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సతీష్ కూడా ఇది వరకు నాగార్జునతో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. ఓ కథ చెప్పి.. ఓకే చేయించుకొన్నాడు కూడా. ఎందుకనో ఆ ప్రాజెక్టు వర్కవుట్ కాలేదు. శతమానం భవతి హిట్‌తో… సతీష్‌కి తలుపులు తెరచుకొన్నాయి. ఇక సతీష్ కథ చెబుతానంటే… ఏ హీరో అయినా వినడానికి రెడీ అవుతాడు. పైగా చేతిలో దిల్‌రాజు లాంటి నిర్మాత ఉంటే ఇక అడ్డేముంది?? నాగార్జునకు ఓ హిట్ బాకీ పడిపోయాడు దిల్‌రాజు. నాగచైతన్యతో చేసిన జోష్ ఫ్లాప్ అయ్యింది. ఆ ఫ్లాప్‌తో పడిపోయిన బాకీ తీర్చుకోవడానికి ఓ మంచి కథతో సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అతి త్వరలో ఈ కాంబినేషన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తాయి.