బుల్లితెర స్టార్.. ఓంకార్. దర్శకుడిగానూ రాణించాలన్న తాపత్రయంతో మెగాఫోన్ పట్టాడు. తొలి సినిమా జీనియస్ నిరాశని మిగిల్చింది. ఆ సినిమా నేర్పిన పాఠాల్ని బుద్దిగా నేర్చుకొని, అనుభవం తెచ్చుకొని తక్కువ బడ్జెట్లో తీసిన రాజుగారి గది కాసుల వర్షం కురిపించింది. నిర్మాతలకు, పంపిణీ దారులకూ రూపాయికి రూపాయి లాభం తెచ్చిపెట్టిన సినిమా ఇది. ఈ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో రాజుగారి గది 2 కి ప్రయత్నాలు మొదలెట్టాడు. ఓంకార్ పై నమ్మకంతో ఈ సినిమా బడ్జెట్ పెరిగింది కూడా. ఓ పెద్ద స్టార్‌ని తీసుకొచ్చి కమర్షియాలిటీ పెంచే ప్రయత్నం చేశారు. ఈ సినిమాని పీవీపీ సంస్థ తెరకెక్కించాల్సింది. అయితే.. ఇప్పుడు ఈ ప్రాజెక్టు దిల్‌రాజు చేతుల్లోకి వచ్చిందని టాక్.
దిల్‌రాజు – ఓంకార్ మధ్య ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు సాగాయి. ఓంకార్‌కి కావల్సిన బడ్జెట్ ఇవ్వడానికి దిల్‌రాజు ముందుకు రావడంతో.. పీవీపీ చేతుల్లోంచి దిల్‌రాజు ప్రొడక్షన్ హౌస్‌కి రాజుగారి గది షిప్ట్ అయ్యింది. ఈ సినిమాలో ఓ పెద్ద హీరో నటిస్తాడని ప్రచారం జరుగా సాగుతోంది. అయితే… దిల్ రాజు మాత్రం.. అలాంటి ప్రయత్నాలేం చేయొద్దంటున్నాడట. రాజుగారి గది చిన్న స్టార్లతో ఎలా తీశావో.. రాజుగారి గది 2 కూడా అలానే తీయ్.. అంటున్నాడట. దానికి ఓంకార్ కూడా ఓకే అన్నట్టు టాక్. రాజుగారి గదిలానే తక్కువ బడ్జెట్‌తో, తక్కువ టైమ్‌లో ఈ సినిమా పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఈ సీక్వెల్ తరవాత ఓ స్టార్ హీరోతో ఓంకార్ సినిమా చేసే అవకాశాలున్నాయని సమాచారం.