ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో `వారసుడు` కూడా ఉంది. అటు చిరంజీవి, ఇటు బాలకృష్ణ చిత్రాలు బాక్సాఫీసు దగ్గర `నువ్వా? నేనా` అంటూ పోటీ పడుతోంటే.. మధ్యలో.. విజయ్ డబ్బింగ్ సినిమా `వారసుడు` కూడా చోటు సంపాదించుకొంది. డబ్బింగ్ సినిమాలకు సంక్రాంతి బరిలో చోటు ఇవ్వడం ఎంత వరకూ సమంజసం? అసలు ఈ పెద్ద హీరోల మధ్య ఆ సినిమా నిలబడగలుగుతుందా? అనే డిబేట్ పక్కన పెడితే.. పబ్లిసిటీ పరంగా.. `వారసుడు` చాలా పూర్ స్టేజ్లో ఉంది. వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు పోటా పోటీగా పబ్లిసిటీ చేస్తూ.. ప్రేక్షకులకు చేరువ అవ్వాలని చూస్తుంటే, ఇప్పటి వరకూ `వారసుడు` ప్రమోషన్లు మొదలవ్వలేదు. రెండు మూడు పాటలు పాటలెప్పుడో వచ్చాయి, అవేంటో మర్చిపోయారు జనాలు. టీజర్, ట్రైలర్ హడావుడి లేదు. ఇదంతా చూస్తుంటే, అసలు సినిమా సంక్రాంతికి వస్తుందా? రాదా? అనే కొత్త అనుమానాలు మొదలయ్యాయి. పబ్లిసిటీ విషయంలో ఎప్పుడూ అత్యంత జాగ్రత్తగా ఉండే దిల్ రాజు.. ఈసారి ఆ దిశగా ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు.
కాకపోతే.. దిల్ రాజు దృష్టి టాలీవుడ్ పై లేదు. తమిళనాట ఈ సినిమాకి క్రేజ్ తేవాలని చూస్తున్నారు. అందుకే తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇది డబ్బింగ్ బొమ్మ అనే సంగతి.. అందరికీ అర్థమైపోయింది. పైగా తెలుగులో ఎంత ప్రమోషన్ చేసినా, ప్రేక్షకుల తొలి ఓటు చిరు, బాలయ్య సినిమాలకే. ఆ తరవాత ఓపిక, డబ్బులు ఉంటే.. సినిమా బాగుందని తెలిస్తే.. అప్పుడు వారసుడు వైపు ఓ లుక్కు వేస్తారు. అందుకే తెలుగులో దిల్ రాజు పెద్దగా ప్రమోషన్లు చేయదలచుకోలేదని వినికిడి. విజయ్ తెలుగు ప్రమోషన్ల కోసం ఒకే ఒక్క రోజు కేటాయించాడట. ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేసి, తెలుగులోనూ ప్రమోషన్లు చేశాం అనిపించుకొంటే సరిపోతుందన్నది దిల్ రాజు ఆలోచన. హీరో విజయ్ కి తమిళనాట ఉన్న గుర్తింపు, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడ సినిమా హిట్ అయితే.. డబ్బులన్నీ తిరిగొచ్చేస్తాయ్. తెలుగులో వచ్చిందంతా బోనసే అనుకోవాలి. అందుకే దిల్ రాజు కూడా తెలుగు ప్రమోషన్లకు లైట్ తీసుకొన్నట్టు అనిపిస్తోంది.