ఇండ్రస్ట్రీలో ఉన్న ఏ టాప్ హీరోతో అయినా సినిమా తీయగలిగే దమ్మున్న నిర్మాత దిల్‌రాజు. ఇంచుమించుగా బడా హీరోలదందరితోనూ సినిమాలు చేసిన దిల్‌రాజుకి ఓ కొరత ఉండిపోయింది. అదే.. పవన్ కల్యాణ్‌తో సినిమా. పవన్ సినిమాల్ని నైజాంలో పంపిణీ చేసి భారీ లాభాల్ని మూటగట్టుకొనే దిల్‌రాజు.. ఎప్పటికైనా పవన్‌తో ఓ సినిమా చేయాలని కంకణం కట్టుకొన్నాడు. అయితే ఆ అవకాశం అందినట్టే అంది చేజారిపోతోంది. 2019 ఎన్నికల తరవాత పవన్ పూర్తిగా రాజకీయాలకే అంకితం అవుతాడని, అడపా దడపా మాత్రమే సినిమా చేయగలడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈలోగా వీలైన్నని సినిమాలు చేయాలన్నది పవన్ ప్లాన్. అందుకే… ఈసారి ఎలాగైనా పవన్‌తో సినిమా చేయాలని దిల్‌రాజు ఓ నిర్ణయానికి వచ్చేశాడు.
ఈ విషయమై పవన్ సన్నిహితుడు నిర్మాత శరత్ మరార్తో దిల్‌రాజు ఇటీవల భేటీ వేసినట్టు తెలుస్తోంది. `ఎలాగైనా పవన్‌తో సినిమా సెట్ చేసి పెట్టండి` అంటూ శరత్‌ని కోరాడట దిల్‌రాజు. కావాలంటే ఆ సినిమాని పవన్ కల్యాణ్ క్రియేటీవ్ వర్క్స్‌తో కలపి చేయడానికి సైతం తాను సిద్ధంగా ఉన్నానని ఆఫర్ ఇచ్చాడట. పవన్ కోసం చాలా కాలం నుంచే కథలు సిద్ధం చేయడం మొదలెట్టాడు దిల్‌రాజు. రెండు మూడు కథల్ని దిల్‌రాజు ఫైనల్ చేశాడని, అందులో పవన్ దేన్ని ఓకే చేసినా తనకు అభ్యంతరం లేదని, దర్శకుడ్ని కూడా పవన్ ఇష్టానుసారమే తీసుకోవచ్చని ఇలా ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాడట. శరత్ మరార్ ఏం చెబితే పవన్ అది చేస్తాడని టాక్. మరి దిల్‌రాజు సినిమా విషయమై.. శరత్ మరార్.. పవన్‌ని ఒప్పిస్తాడా? ఇంత బిజీ షెడ్యూల్లో పవన్ దిల్‌రాజుకు అవకాశం ఇవ్వగలడా? అనేది వేచి చూడాలి.