మిస్టర్ పెర్ఫెక్ట్ అనిపించుకున్న నిర్మాతలలో దిల్‌రాజు ఒకడు. స్క్రిప్టు విషయంలో పక్కాగా ఉంటాడాయన. అందుకే దిల్ రాజు బ్యానర్లో అన్ని విజయాలు చేరాయి. అలాంటి దిల్‌రాజు పూర్తి స్థాయి స్క్రిప్టు లేకుండానే ఓ సినిమా పూర్తి చేశాడంటే ఆశ్చర్యం వేస్తుంది. `ఎఫ్ 2` అలా వచ్చిన సినిమానే. ఈ విషయాన్ని దిల్ రాజు సైతం అంగీకరించాడు. ”దర్శకుడు అనిల్ రావిపూడి దగ్గర ఓ మ్యాజిక్ ఉంది. సాధారణంగా నేను స్క్రిప్టు లేకుండా సినిమాలు సెట్స్‌పైకి తీసుకెళ్లను. స్క్రిప్టు చేతిలో లేకపోతే ఓ సినిమా ఒప్పుకోను. కానీ అనిల్ మాత్రం సీన్లు చెప్పి ఒప్పిస్తాడు. సెకండాఫ్ లేకుండా షూటింగ్ కి ఎలా వెళ్లిపోయావ్ అని శిరీష్ ఆశ్చర్యపోయాడు. నన్ను అంతలా కన్విన్స్ చేస్తుంటాడు” అని ‘ఎఫ్ 2’ వెనుక ఉన్న సీక్రెట్ చెప్పేశాడు దిల్‌రాజు.
విడుదలకు సరిగ్గా రెండు రోజుల ముందు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం దిల్ రాజు గట్స్‌ని చెబుతుంది. సినిమా హిట్టయితే, హిట్ టాక్ వస్తే.. సక్సెస్ మీట్లలో ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. ‘కథ వినకుండా ఓకే చేశా’ అంటూ కవరింగులు ఇస్తుంటారు. అలాంటిది 2 రోజులకు ముందే దిల్‌రాజు ఇలా మాట్లాడడం ఆయన నమ్మకాన్ని తెలుపుతుంది. సినిమా బాగా ఆడితే… దీన్ని కాన్ఫిడెన్స్ అంటారు. లేదంటే.. ‘అసలు స్క్రిప్టు లేకుండా షూటింగ్‌కి ఎలా వెళ్లాడు’ అంటూ… విమర్శలూ నెత్తిమీద వేసుకోవాల్సివస్తుంది. మరి దిల్‌రాజుకి ఎలాంటి కౌంటర్లు ఎదురవుతాయో చూడాలి.