టాలీవుడ్‌కు లీకుల బెడద తప్పడం లేదు. సినిమా కంటెంట్ పైరసీ రూపంలో బయటికి వచ్చేస్తుంది. తాజాగా ‘‘సర్కారు వారి పాట’’ చిత్రంలోని ‘కళావతి’ పూర్తి పాట లీక్ అవ్వడం షాక్‌కు గురిచేసింది. అలాగే పవన్ కల్యాణ్ ‘‘భీమ్లా నాయక్’’ సాంగ్ నుంచి కూడా ఒక చిన్న బిట్ లీక్ అయ్యి నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఈనేపథ్యంలో.. నిర్మాత దిల్ రాజు నిర్మాణ సంస్థ ‘‘శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్’ సామాజిక మాధ్యమాల ద్వారా ఓ విజ్ఞప్తి చేసింది.
‘‘రామ్ చరణ్ తో మేము తీస్తున్నా సినిమా.. కథకు అనుగుణంగా బహిరంగ ప్రదేశాల్లో షూటింగ్ జరుగుతోంది. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని, చట్టవిరుద్ధంగా తీసిన షూటింగ్ చిత్రాలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా ఉండాలని అభ్యర్థిస్తున్నాం. అనధికారిక కంటెంట్‌ను పోస్ట్ చేసే ఐడీలపై మా యాంటీ పైరసీ టీమ్ చర్య తీసుకుంటుంది. మీరు కనుక పైరసీ లింక్స్‌ను మా దృష్టికి తీసుకురావాలనుకుంటే.. report@blockxtech.comకు రిపోర్ట్ చేయండి’’ అంటూ ట్వీట్ చేశారు నిర్మాతలు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ప్రస్తుతం షూటింగ్ రాజమండ్రిలో జరుపుకుంటుంది. చిత్రంలో కియార అద్వానీ హీరోయిన్.