దిల్ రాజు డబుల్ హ్యాట్రిక్ ఆశపై… నీళ్లు చల్లింది ఎంసీఏ. నానికి ఉన్న క్రేజ్, సెలవలు ఈ సినిమాకి కలిసొచ్చాయి. తొలి రెండు రోజుల వసూళ్లు బాగానే ఉన్నాయి. కాకపోతే సెలవలు అయిపోయాక ఎంసీఏ పరిస్థితి ఏంటన్నది తేలాల్సివుంది. రివ్యూల పరంగా చూస్తు ఎంసీఏ కంటే హలోకి ఎక్కువ మార్కులు పడుతున్నాయి. దానికి తగ్గట్టుగానే మల్టీప్లెక్స్‌లలో, ఓవర్సీస్లో హలోదే హవా. దిల్‌రాజు మాత్రం అప్పుడే తమ సినిమా బ్లాక్ బ్లస్టర్ పోస్టర్లు వదిలేశారు. విడుదల రోజునే… ‘మాది సూపర్ హిట్’ అంటూ పటాకులు పేల్చి సందడి చేసుకున్నారు. ఇప్పటి వరకూ అయితే
ఎంసీఏ పరిస్థితి బాగుంది. పెద్ద హీరోలకు దీటుగా వసూళ్లు దక్కాయి. అందుకే రేపో మాపో సక్సెస్‌మీట్ పెట్టి `నేను డబుల్ హ్యాట్రిక్ కొట్టేశాను` అని అనొచ్చు. దానికి రుజువుగా లెక్కలూ చూపించొచ్చు. దిల్‌రాజు చెప్పే లెక్కలన్నీ నిజమైనా, వాటిలో ఏదైనా మతలబు ఉందా అనే అనుమానం ట్రేడ్ వర్గాల్లోబలంగా ఉంది.
నైజాంలో ఆయన సొంతంగా విడుదల చేసుకుంటారు. మిగిలిన ఏరియాల్లో దాదాపుగా ఆయన మనుషులకే సినిమాల్ని అమ్ముతారు. ఓవర్సీస్లో కూడా పార్టనర్ షిప్ పద్ధతిపై సినిమాని విడుదల చేస్తుంటారు. అందుకే ఆయన లెక్కలు నిజమా, కాదా అనేది బయటి ప్రపంచానికి అంతగా తెలీదు. ఆయనచెప్పిందే లెక్క. డీజే విషయంలోనూ నోటికొచ్చిన అంకెలే బయటకు వచ్చాయన్నది వినికిడి. ఆరోజున మా సినిమా ఇన్ని వసూళ్లు సాధించింది, అన్ని రికార్డులు బద్దలు కొట్టింది అని గొప్పగా చెప్పిన దిల్‌రాజు… ఇప్పుడు మాట మార్చి – కొన్ని ఏరియాల్లో నష్టాలొచ్చిన మాట నిజమే అని ఒప్పుకున్నారు. అంటే.. అప్పటివి తప్పుడు లెక్కలనే కదా అర్థం. ఎంసీఏ ఆయనకు ప్రతిష్టాత్మక చిత్రం. ఈ సినిమా హిట్టయితే డబుల్ హ్యాట్రిక్ కొట్టిన తెలుగు నిర్మాతగా ఆయన పేరు చరిత్రలో నిలిచిపోతుంది. అందుకే.. ‘మా సినిమా హిట్టు’ అని తొలిరోజే పోస్టర్లు వేసుకున్నారు. ఈ సినిమా విషయంలోనైనా దిల్ రాజు నోటి నుంచి సరైన లెక్కలే వస్తాయా అనేది అనుమానంగా మారింది. ఆయన చెప్పింది రాసుకోవడం తప్ప, సరైన అంకెలేవి అనేది ఎవ్వరికీ తెలీదు. రేపో మాపో సక్సెస్‌మీట్ పెడతారు కదా. అప్పుడు అంకెలు బయటకు వస్తాయి. వాటితో ట్రేడ్ వర్గాల అంకెలతో పొంతన ఉంటుందో లేదో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.