తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 24 సీట్లు అత్యంత కీలకంగా మారాయి. వీటిలో మజ్లిస్ పార్టీకి ఆరు సీట్లు గ్యారంటీగా వస్తాయి. ఏడో సీటు లక్పై ఆధారపడి ఉంది. నాంపల్లిలో ఈ సారి గట్టి పోటీ నెలకొంది. మూడు సార్లు వరసగా ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ సారి గెలిచి తీరుతానని అంటున్నారు. ఆయనపై ప్రజల్లో సానుభూతి కూడా ఉంది. అందుకే ఈ సీటు కాంగ్రెస్ దేనని ప్రచారం జరుగుతోంది. మిగతా స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
గ్రేటర్ పరిధిలో ఓటర్లు దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన వారు ఉంటారు. ఏపీ నుంచి వచ్చి స్థిరపడిన వారు కాస్త ఎక్కువగా ఉంటారు. తెలంగాణలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారూ భారీగా ఉంటారు. అచ్చమైన హైదరాబాదీలు చాలా తక్కువ. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకూ గ్రేటర్ పరిధిలో టీఆర్ఎస్కు కనీస పట్టు లేదు. గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ కూడా చేయలేకపోయారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో 3 సీట్లు మాత్రమే సాధించింది. కానీ 2018 ఎన్నికల్లో ఏకంగా 14 స్థానాలు గెలిచింది. మజ్లిస్ మద్దతు కలసి వచ్చిదంి.
కాంగ్రెస్పార్టీ 2009లో గ్రేటర్లోని 24 చోట్ల పోటీ చేసి 14 స్థానాలు గెలుచుకున్నది. అప్పటి నుంచి 2018 వరకు పెద్దగా సీట్లు గెలుచుకోలేదు. గ్రేటర్ పరిధిలో బీజేపీ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ఆ పార్టీ గత ఎన్నికల్లో గోషామహల్లో మాత్రమే గెలుపొందింది. ఈసారి గోషామహల్తోపాటు ముషీరాబాద్, అంబర్పేట్, ఖైరతాబాద్, ఉప్పల్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, సనత్నగర్, జూబ్లీహిల్స్, మల్కాజ్గిరి ల్లో గెలుస్తామని భావిస్తోంది. గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లను గెలిచింది. ఆ నమ్మకంతో గట్టి ప్రయత్నాలు చేస్తోంది.
టీడీపీ ఈ ఎన్నికల్లో దూరంగా ఉంటం తమకు లాభిస్తుందని అన్ని పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. బీజేపీ , కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు టీడీపీ జెండాలను కూడా తమ ర్యాలీల్లో కనిపిచేలా చేసుకుంటున్నారు. గ్రేటర్ పరిధిలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు దక్కించుకుంటే వారికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.