ఎన్టీఆర్ అభిమానులకు ఇది బ్యాడ్ న్యూసే. విపరీతమైన అభిమానుల తాకిడితో.. `దేవర` ప్రీ రిలీజ్ ఫంక్షన్ రద్దు అయిన క్షణాలు వాళ్లింకా జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం సక్సెస్ సెలబ్రేషన్స్ అయినా ఉంటాయి అనుకొంటే… ఇప్పుడు వాటికీ చుక్కెదురైంది. దసరా, నవరాత్రుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ మీట్ పెట్టుకోవడానికి అనుమతులు దొరకడం కష్టం అవుతోందని, అయినా చివరి నిమిషం వరకూ ప్రయత్నిస్తామని నిర్మాత సూర్య దేవర నాగవంశీ లేటెస్టుగా ట్వీట్ చేశారు. దాంతో.. దేవర సక్సెస్ మీట్ జరగడం దాదాపు అసాధ్యమే అని తేలిపోయింది. అక్టోబరు 2న సక్సెస్ మీట్ పెడతారని, వేదిక కూడా ఖరారైపోయిందని నాలుగైదు రోజులుగా వార్తలు వస్తున్నాయి. అక్టోబరు 2 వచ్చింది, వెళ్లిపోయింది. దాంతో సక్సెస్ మీట్ ఎక్కడ? అనే తర్జన భర్జనలు మళ్లీ మొదలయ్యాయి. దసరా పండగ లోపే సక్సెస్ మీట్ నిర్వహిస్తారని అంతా ఆశించారు. కానీ చివరికి నాగ వంశీ ఒక్క ట్వీట్ తో అందరి ఆశలపై నీళ్లు చల్లారు. దసరా పండగ అయిపోయిన తరవాత…. సక్సెస్ మీట్ పెట్టినా లాభం లేదు. అప్పటికే థియేటర్ల నుంచి సినిమా బయటకు వెళ్లిపోతుంది. ఈ హుషారూ తగ్గిపోతోంది. దాదాపు ఆరేళ్ల తరవాత ఎన్టీఆర్ సోలోగా చేసిన సినిమా ఇది. డివైడ్ టాక్ ని సైతం తట్టుకొని మంచి వసూళ్లు అందుకొంది. మాస్ సినిమా రేంజ్ ఏమిటో బాక్సాఫీసుకు చూపించింది. ఇలాంటి సినిమాల్ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా అవసరం.
`దేవర` ప్రమోషన్లకు ముందు నుంచీ ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. తెలుగులో సరిగా ప్రమోట్ చేయలేదు. ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్ కూడా నిర్వహించలేదు. కొరటాల శివ ప్రింట్ మీడియా ముందుకొచ్చారంతే. కొన్ని లిమిటెడ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి ఏమైందో అందరికీ తెలిసిందే. `కచ్చితంగా సక్సెస్ మీట్ అభిమానుల మధ్యే చేస్తాం` అని కొరటాల మాట ఇచ్చారు. కానీ ఇప్పుడు అదీ లేకుండా పోయింది.