ఈ ఫిబ్రవరిలో కొత్త సినిమాల హడావుడి బాగా కనిపించబోతోంది. తండేల్, లైలా, దిల్ రూబా, మజాకా.. ఇలా మంచి సినిమాలే వరుస కడుతున్నాయి. అయితే.. విడుదల తేదీలు కాస్త అటూ ఇటూ అయ్యే అవకాశం ఉంది. ఈనెల 14న ‘దిల్ రూబా’ రావాలి. అయితే ఈ సినిమా ఓ వారం ఆలస్యం అవుతుందని సమాచారం. అధికారిక ప్రకటన రావాల్సివుంది. ఆర్.ఆర్.. ఇంకా పూర్తవ్వలేదని తెలుస్తోంది. ప్రమోషన్లకు కాస్త సమయం తీసుకోవాలని కిరణ్ అబ్బవరం భావిస్తున్నాడు. ‘క’తో మంచి విజయాన్ని అందుకొన్నాడు కిరణ్. తదుపరి సినిమా కాబట్టి, ఇంకాస్త కేర్‌గా ఉండాలని అనుకొంటున్నాడు. సో.. ‘దిల్ రూబా’ వారం ఆలస్యంగా అంటే ఫిబ్రవరి 21న విడుదల కానుంది.
ఫిబ్రవరి 21న ‘మజాకా’ రావాల్సివుంది. సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. నక్కిన త్రినాథరావు దర్శకుడు. కాంబో పరంగా మంచి బజ్ వుంది. సినిమా కూడా రెడీగానే ఉంది. కాకపోతే.. ఫిబ్రవరి 21 కంటే మహాశివరాత్రికి వస్తే బాగుంటుందని నిర్మాత రాజేష్ దండా భావిస్తున్నారు. ఫిబ్రవరి 26 బుధవారం సెలవు. ఆ రోజు సినిమా వస్తే.. లాంగ్ వీకెండ్ ఉంటుంది. పైగా శివరాత్రికి బాక్సాఫీసు దగ్గర పెద్దగా పోటీ కూడా లేదు. కాబట్టి.. కలిసొస్తుందన్న ఆలోచన. ఈ రెండు సినిమాలూ వారం రోజులు ఆలస్యంగా రావడం దాదాపు ఖాయమే. కాకపోతే నిర్మాతలు అధికారికంగా ప్రకటించాలంతే.