Dilruba movie review
తెలుగు360 రేటింగ్ 2/5
‘క’ తరవాత కిరణ్ అబ్బవరంపై గౌరవం పెరిగింది. తన ఇమేజ్ కొత్త గా టర్న్ తీసుకొంది. ఇకపై మరింత జాగ్రత్తగా సినిమాలు చేయాల్సిన తరుణం. హిట్టు రావడం కంటే, దాన్ని నిలబెట్టుకోవడానికే ఎక్కువ కష్టపడాలి. కిరణ్ కి అది తెలుసు. ‘క’ కంటే ముందే ‘దిల్ రూబా’ పూర్తయ్యింది. కానీ ‘క’ రిలీజ్ అయ్యింది. దాంతో తదుపరి వస్తున్న సినిమాపై ఎన్ని అంచనాలు ఉంటాయో కిరణ్‌కు అర్థమైంది. అందుకే ‘దిల్ రూబా’ విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకొన్నాడు. రీషూట్లు చేశాడు. పబ్లిసిటీ స్పీడు పెంచాడు. ‘ఈ సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే.. నన్ను చితగ్గొట్టండి’ అని స్వయంగా ‘దిల్ రూబా’ నిర్మాతే స్టేట్మెంట్ విసరడం కాస్త వైరల్ అయ్యింది. వీటన్నింటి మధ్య ‘దిల్రూబా’ విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా వుంది? కిరణ్ పడిన కష్టం ఫలించిందా, తాను పెంచుకొన్న నమ్మకం నిజమైందా?
సిద్దార్థ్ (కిరణ్ అబ్బవరం)ది ఓ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ. తను ప్రేమించిన మ్యాగీ (నజియా)తో కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అవుతుంది. నమ్మిన స్నేహితుడు తన తండ్రిని మోసం చేయడంతో సిద్దార్థ్ తట్టుకోలేకపోతాడు. అప్పటి నుంచీ ప్రేమ అనే ఎమోషన్‌కు దూరం అవుతాడు. సారీ, థ్యాంక్స్… ఈ రెండు పదాలకు కూడా విలువ ఇవ్వడు. అంతే కాదు. తాను ఎవరికీ సారీ, థ్యాంక్స్ చెప్పడు. ఇలాంటి సిద్దార్థ్ జీవితంలోకి అంజలి (రుక్సార్ థిల్లాన్) వస్తుంది. సిద్దార్థ్ ని ప్రేమించమని వెంట పడుతుంది. చివరికి సిద్దార్థ్ కూడా మ్యాగీని మర్చిపోయి అంజలి ప్రేమలో పడతాడు. కొన్ని కారణాల వల్ల వీళ్ల మధ్య కూడా గ్యాప్ వస్తుంది. వీరిద్దరి కలపడం కోసం సిద్దార్థ్ కు బ్రేకప్ చెప్పిన మ్యాగీ అమెరికా నుంచి తిరిగి వస్తుంది. అసలు మ్యాగీ ఇండియా ఎందుకు రావాల్సివచ్చింది? అంజలితో సిద్దార్థ్ గొడవేంటి? ఈ ప్రేమకథ చివరికి ఏ తీరానికి చేరింది? అనేదే ‘దిల్ రూబా’ సినిమా.
ఈ కథలో రెండు ఆసక్తికరమైన ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి.. హీరో ఎవరికీ సారీ, థ్యాంక్స్ చెప్పడు. రెండోది తన మాజీ ప్రియుడి ప్రేమకథని సుఖాంతం చేయడం కోసం పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లిపోయిన ఓ అమ్మాయి తిరిగి ఇండియా రావడం. ఈ రెండు పాయింట్లూ కొత్తగానే ఉన్నాయి. బహుశా… కిరణ్ అబ్బవరం ఇక్కడే లాక్ అయిపోయి ఉంటాడు. హీరో క్యారెక్టరైజేషన్ కాస్త కొత్తగా ఉన్నా, థియేటర్లో ప్రేక్షకుల్ని కాసేపు కూర్చోబెట్టొచ్చన్న భరోసా ఈతరం దర్శకులకు ఉంది. కాకపోతే పాయింట్ దగ్గరే ఆ కొత్తదనం ఆగిపోకూడదు. సీన్లుగా తెరపై కి వచ్చినప్పుడు కూడా ఆ ఫ్రెష్ నెస్ కనిపించాలి. అదే ‘దిల్ రూబా’లో లోపించింది. టామ్ బోయ్ లాంటి అంజలి క్యారెక్టర్ కాస్త ఇంట్రస్టింగ్ గానే ఉంటుంది. హీరో క్యారెక్టరైజేషన్ కూడా కొత్తగానే ఉంది. అలాంటప్పుడు సీన్లు బాగా రావాలి. కానీ అది జరగలేదు. కాలేజీలో లవ్ ట్రాక్ ఏమంత గొప్పగా అనిపించలేదు. కాలేజీ గొడవలు, బైక్‌కి తగలబెట్టేయడం, అక్కడ యాక్షన్.. ఇవన్నీ అనుకొన్న పాళ్లలో కుదర్లేదు. ఇంట్రవెల్ ఫైట్ బాగుంది. దాన్ని బాగానే డిజైన్ చేశారు. కానీ హీరో అంత ఎగ్రసివ్‌గా ఫైట్ చేయడానికి సరైన రీజనింగ్, ఎమోషన్ లేవు.
సెకండాఫ్ లో మాజీ లవర్ రంగంలోకి దిగుతుంది. తానొచ్చాక లవ్ స్టోరీ కొత్త మలుపు తీసుకొంటుందనిపిస్తుంది. ఆ ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడ కూడా దర్శకుడు సరైన సన్నివేశాలు రాసుకోలేకపోయాడు. కథలో సంఘర్షణ సహజంగా పుట్టాలి. కానీ అది కూడా బలవంతంగా ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది. జోకర్ పాత్రకూ ఈ కథకూ సంబంధం ఏమిటో అర్థం కాదు. అది కావాలని అతికించిన యాక్షన్. రూ.600 కోట్ల నష్టం తెచ్చిపెట్టినప్పుడు విలన్ పాత్ర హీరోపై పగ తీర్చుకోవాలనుకోవడం సహజం. అయితే ‘నేను వాడ్ని ఎమోషనల్‌గా టార్చర్ చేయాలి’ అని విలన్ అనుకోవడం మరీ సిల్లీగా అనిపిస్తుంది. కడప నేపథ్యంలో తీర్చిదిద్దిన సీన్ ఒకటి బాగుంది. కడప ప్రజలు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటారో చెప్పారు. దాన్ని క్లైమాక్స్ లోనూ వాడుకొన్నారు. మధ్యమధ్యలో కొన్ని మాస్ మూమెంట్స్, కుర్రాళ్లకు నచ్చే విషయాలూ జరిగిపోతుంటాయి. అవన్నీ కాస్త రిలీఫ్ ఇచ్చే విషయాలు. క్లైమాక్స్ లో.. అసలు థ్యాంక్స్, సారీ ఎందుకు చెప్పాలి? ఎప్పుడు చెప్పాలి? అనే పాయింట్లపై హీరోతో ఇచ్చిన క్లారిఫికేషన్ బాగుంది. కానీ అప్పటికే జనాలకు నీరసాలు వచ్చేస్తాయి.
కిరణ్ అబ్బవరంలో టాలెంట్ వుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. దాన్ని సరైన పద్ధతిలో వాడుకోవాలి. ఈ సినిమాలో తను అందంగా కనిపించాడు. ఫైట్లు బాగా చేశాడు. ఎమోషన్ సీన్స్ లో నటించేటప్పుడు, అరచి డైలాగులు చెప్పేటప్పుడు ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. రుక్సార్ పాత్ర చలాకీగా వుంది. తను బాగానే చేసింది. నజియా మిస్ మ్యాచ్. అందం, అభినయం రెండు విషయాల్లోనూ ఆకట్టుకోలేకపోయింది. చాలా పాత్రలు మిస్ మ్యాచ్ అయ్యాయి. కాలేజీ విలన్ పాత్రతో సహా. సత్యని కూడా సరిగా వాడుకోలేదు.
శ్యామ్ సి.ఎస్ నేపథ్య సంగీతం, తాను అందించిన పాటలు బాగున్నాయి. పాటలతో జోష్ వచ్చింది. కేసిపీడీ థీమ్ ని యాక్షన్ సీన్లో వాడుకోవడం బాగుంది. ఇంట్రవెల్ ఫైట్‌కు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ ఇంకా బాగుంది. కెమెరా వర్క్ ఓకే అనిపిస్తుంది. దర్శకుడిపై పూరి ప్రభావం చాలా వుంది. పూరి మ్యూజింగ్స్ లోని మాటలు బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తుంటాయి. హీరో క్యారెక్టరైజేషన్, మాట్లాడే పద్ధతిలోనూ పూరి మార్క్ వుంది. కొన్ని మాటలు బాగా రాసుకొన్నాడు. తనకు రైటింగ్ పరంగా మంచి గ్రిప్ వుంది. కానీ తాను చెప్పదలచుకొన్న పాయింట్ ని ప్రభావవంతంగా చెప్పలేకపోయాడు. సెకండాఫ్ పూర్తిగా ట్రాక్ తప్పేశాడు. కథకు సంబంధం లేని ఎమోషన్‌నీ, విలన్నీ తీసుకొచ్చి తాను గందరగోళంలో పడిపోయాడు. మొత్తానికి ‘క’ తరవాత ఓ మంచి సినిమా తీసి, మరో మెట్టు ఎక్కాల్సిన కిరణ్.. అడుగు వేయడంలో తడబడ్డాడు.
తెలుగు360 రేటింగ్ 2/5