ఓ సినిమా తీయడం కంటే.. ఆ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సివస్తోంది. ఓటీటీల హవా ఎక్కువ అయిపోయిన తరవాత ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడమే పెద్ద సవాల్ గా మారింది. ‘మా సినిమా బాగుంటుంది. తప్పకుండా చూడండి’ అంటే మసాలా సరిపోవడం లేదు. ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాల్సిందే. మొన్నటి వరకూ ‘సినిమా బాగుంటే ఒక్కరికి చెప్పండి – బాగోలేకపోతే వంద మందికి చెప్పండి’ అంటూ ఓ నినాదాన్ని బాగా వినిపించేవారు. సినిమా నచ్చకపోతే, డబ్బులు వాపస్ ఇస్తామని ఛాలెంజ్ చేసినవాళ్లూ ఉన్నారు. ‘కోర్ట్ నచ్చకపోతే నా రాబోయే హిట్ 3 చూడొద్దు’ అంటూ నాని లాంటి హీరో సైతం సంచలన స్టేట్మెంట్ విసిరాడు. ఇప్పుడు ‘దిల్ రూబా’ నిర్మాత మరో అడుగు ముందుకు వేశాడు. ‘ఈ సినిమాలో ఫైట్స్ చూసి తెర చించి అవతల పారేయకపోతే.. నన్ను చితగ్గొట్టి అవతల పారేయండి.. నేను ఇకపై సినిమాలు కూడా తీయను’ అని వేదికపై ప్రకటించేశాడు. ‘దిల్ రూబా’ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో.. నిర్మాత ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
కిరణ్ అబ్బవరం నటించిన సినిమా ‘దిల్ రూబా’. ఈనెల 14న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సినిమాపై నిర్మాత గట్టి నమ్మకంతో ఉన్నాడు. అందుకే దాదాపు అన్ని ఏరియాల్లోనూ సొంతంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో ఫైట్స్ బాగా వచ్చాయని, ఆ ఫైట్స్ చూసి ప్రేక్షకులు తెరలు చించేస్తారని, అలా జరక్కపోతే… తనని చితగ్గొట్టి అవతల పారేయొచ్చని, సినిమాలకు కూడా దూరం అవుతానని క్రేజీ ప్రకటన చేశారు. ఈ స్పీచ్ విని అంతా ముక్కున వేలేసుకొంటున్నారు. ఇదంతా నిర్మాతకు సినిమాపై ఉన్న నమ్మకమా? లేదంటే థియేటర్లకు ప్రేక్షకుల్ని ఎలా రప్పించాలో తెలీక.. ఇలాంటి స్టేట్ మెంట్లు ఇవ్వాల్సివస్తుందా? అనేదే అర్థం కావడం లేదు. మొత్తానికి ‘దిల్ రూబా’ ప్రీ రిలీజ్ లో నిర్మాత స్పీచ్.. టాక్ ఆఫ్ ది టౌన్ గా మారబోతోంది. మున్ముందు నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఇంకెన్ని చెబుతారో? ఇంకెన్ని వినాల్సివస్తుందో?