శర్వానంద్ – సంపత్‌నంది కాంబోలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ ని ఎంపిక చేశారు. ఈ కథలో రెండో నాయికకూ చోటుంది. ఆ ఛాన్స్ డింపుల్ హయతికి దక్కింది. `కిలాడీ` సినిమాలో రవితేజ సరసన ఆడి పాడింది డింపుల్. ఆ తరవాత తనకు కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ దేన్నీ సద్వినియోగం చేసుకోలేదు. ఇప్పుడు సంపత్ నంది సినిమాతో మరో ఛాన్స్ వచ్చినట్టైంది. ఈసారి డింపుల్ గ్లామర్‌కే పరిమితం కావడం లేదని, ఆమెలోని నటిని కొత్త కోణంలో ఆవిష్కరించే పాత్ర ఇదవుతుందని చిత్రబృందం చెబుతోంది.
శర్వా నటించే 38వ సినిమా ఇది. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందించనున్నారు. కె.కె.రాధామోహన్ నిర్మాత. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో ఓ సెట్ వేశారు. అక్కడ దాదాపు 40 శాతం షూటింగ్ జరగబోతోంది. ఈ సెట్ కోసం దాదాపు రూ.4 కోట్లు ఖర్చు పెట్టారని టాక్. `సిటీమార్` తరవాత సంపత్ నంది దర్శకత్వం వహించే సినిమా ఇదే. ఇటీవల విడుదలైన `ఓదెల 2`కు సంపత్ నిర్మాతగా, దర్శకత్వ పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర సరైన ఫలితం రాబట్టలేకపోయింది కానీ, ఓటీటీ బిజినెస్‌తో నిర్మాతలు సేఫ్ అయ్యారు. శర్వా సినిమా మే మొదటి వారంలో సెట్స్‌పైకి వెళ్తుంది.