ఈ సీజన్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు దినేష్ కార్తీక్. అయితే.. సడన్ గా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. కెప్టెన్సీ బాధ్యతలు వదులుకోవాలన్న నిర్ణయానికి వచ్చాడని టాక్. ఆ బాధ్యతని ఇప్పుడు జట్టులోకి కీలకమైన సభ్యుడైన మోర్గాన్ ని అప్పగించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోందని టాక్. ఈ సీజన్లో కోల్‌కతా అంతంత మాత్రంగానే రాణిస్తోంది. కెప్టెన్ గానే కాకుండా, ఇటు ఆటగాడిగానూ దినేష్ కార్తీక్ విఫలం అవుతున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ కూర్పుపై కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఫామ్ లో లేని నరైన్ ని ఓపెనింగ్ కి పంపడం, ఫామ్ లో ఉన్న మోర్గాన్ కి బ్యాటింగ్ చేసే అవకాశం అంతగా ఇవ్వకపోవడం విమర్శలకు తావిచ్చింది. దాంతో.. దినేష్ కార్తీక్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
అసలు జట్టు యాజమాన్యం దినేష్‌కి కెప్టెన్సీ ఎందుకు అప్పగించిందో అర్థం కాదు. ఇంగ్లండ్ కి వరల్డ్ కప్ అందించిన మోర్గాన్ లాంటి అనుభవజ్ఞుడు జట్టులో ఉన్నప్పుడు.. సారధ్య బాధ్యతలు కూడా తనకే అప్పగిస్తే బాగుండేది. పైగా దినేష్ కార్తీక్ కి కెప్టెన్ గా అనుభవం చాలా తక్కువ. అటు కీపర్ గా, ఇటు కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్ గా మూడు బాధ్యతలు నిర్వహించడం తనకు కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ కీలకమైన నిర్ణయం తీసుకుంటున్నట్టు టాక్. సీజన్ మధ్యలో కెప్టెన్సీని వదులుకోవడం ఐపీఎల్ లో చాలా అరుదుగా చూస్తుంటాం. జట్టుని మళ్లీ విన్నింగ్ రేస్‌లో నిలపాలంటే… ఇలాంటి నిర్ణయాలు ఇప్పుడు అవసరం కూడా.