నేర సామ్రాట్ నయీం ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన నా వ్యాసంలో చాలా అంశాలు విశ్లేషణాత్మకంగా వున్నాయని మాజీ డిజిపి దినేష్ రెడ్డి అభినందించారు. దానిపై ఫోన్ చేసి మాట్లాడుతూ రెండు చోట్ల తనకు సంబంధించి రాసే ముందు సంప్రదించనందుకు నొచ్చుకున్నారు. మా మాటల వ్యాస్ హత్యకేసులో తాను ప్రధాన లేదా ప్రత్యక్షసాక్షిని అంటూ వచ్చిన కథనాలు నిజం కాదని మామూలు సాక్షినేనని దినేష్‌రెడ్డి తెలిపారు.నిజానికి వ్యాస్ తనకు చాలా ఇష్టమైన వ్యక్తి అని తను అభిమానించే అధికారి అని తెలిపారు. వింటర్ కాలం ఉదయం మంచులో దూరాన వున్న తనకు దాడి చేసిన వారెవరో కనిపించే అవకాశం లేదని స్పష్టం చేశారు. అరుణా వ్యాస్ పరిస్థితి కూడా అంతేనన్నారు. ఒక వేళ నిజంగా చూడగలిగేంత దగ్గరగా వుండి వుంటే తనపైనా కాల్చకుండా వదిలే అవకాశం వుండదు కదా అని ప్రశ్నించారు. విచారణ జరిపిన కెఎన్మూర్తి ఇచ్చిన నివేదికలోనూ తనకు వ్యతిరేకంగా ఎలాటి అభిశంసన లేదని, కనుక తాను ఆయనపై ఆగ్రహం పెంచుకునే ప్రసక్తి వుండదని దినేష్ రెడ్డి వివరించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు వచ్చిన కొన్ని ఫిర్యాదులపై 2004లో వైఎస్ ముఖ్యమంత్రిగా స్వర్ణజిత్ సేన్ డిజిపిగా వున్న సమయంలో దర్యాప్తు జరిగింది. నేను కమిషనర్‌గా వున్నాను. అయితే అప్పటికి మూర్తి ఆరోగ్యం అస్సలు బాగాలేదని నేనే పంపించేశాను. నేను డిజిపి అయినప్పుడు దాని కొనసాగింపు వచ్చింది తప్ప ప్రత్యేకంగా చేసింది లేదు అని చెప్పారు.
నయీంతో తనకు ఏ దశలోనూ సంబంధాలు లేవని దినేష్ రెడ్డి మరోసారి చెప్పారు. చూడలేదు గనకే ఎన్కౌంటర్ వార్లలో అతని ఫోటో చూసి మొదట ఎవరో జోకర్ అనుకున్నారట. అతన్ని అరెస్టు చేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి అనుమతి నివ్వలేదంటూ ఇన్ఫార్మర్లను వాడుకోవాలనే దృష్టి తరచూ అడ్డుపడుతుంటుందని అన్నారు. నయీంతో సంబంధాలున్నట్టు ఆరోపణలున్న మాజీ డిజిపి తనుకాదని ఆయన ఎవరో పేరు తెలిసి కూడా గిట్టని ఛానల్ కావాలని మాజీ డిజిపి అని తమపై సందేహాలు పెంచేలా స్క్రోలింగులిస్తున్నదని విమర్శించారు. దురుద్దేశంతో కొందరు ఐపిఎస్‌ల పేర్లు వదులుతూ వారి భవిష్యత్ నియామకాలను దెబ్వతీయాలని కొన్ని పత్రికల్లో ప్రయత్నం జరుగుతున్నదని ఆయన ఆరోపించారు.
నయీం గురించి తాను బిజెపి తరపునే మాట్లాడానని మాజీ డిజిపి నొక్కి చెబుతున్నారు. ఈ మేరకు బిజెపి కార్యాలయం నుంచి మీడియాకు ఆహ్వానం పంపిన మెసేజ్ కాపీని కూడా పంపించారు. ఉన్నత స్థాయి మాజీ పోలీసు అధికారి పార్టీలో వుండి కూడా ఇంత సంచలన సంఘటనపై బిజెపి అధికారికంగా స్పందించక పోవడం సరికాదనే వ్యాఖ్యలు వచ్చాకే తను మాట్లాడాలన్న నిర్ణయం జరిగిందన్నారు. వాస్తవానికి తన మీడియా గోష్టి తర్వాత బిజెపి జాతీయ నాయకత్వం నుంచి అభినందనలు అందడం ఆయనకు సంతోషం కలిగిస్తున్నది.