కొన్ని కథలు సెట్స్ పై ఉండగానే అదే కథ, పాత్రలు పోలిన సినిమా విడుదల కావడం చాలా సార్లు జరుగుతుంది. ఇప్పుడు అఖిల్ ఏజెంట్ విషయంలో కూడా ఇలానే జరిగింది. ఈ చిత్రంలో డినో మోరియా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూ లో తన పాత్ర గురించి చెప్పాడు.
”ఇందులో ఏజెంట్ గా కనిపిస్తా. అయితే నేను బ్యాడ్ ఏజెంట్. వ్యవస్థలో నాకు జరిగిన ద్రోహం కారణంగా మృగంగా మారిపోయే పాత్ర నాది. నన్ను ఆపడానికి అఖిల్ ఏజెంట్ గా వస్తాడు. మా ఇద్దరికి మహాదేవన్( మమ్ముట్టి) శిక్షణ ఇస్తారు. ఇది ముగ్గురు ఏజెంట్స్ మధ్య జరిగే కథ” అని చెప్పుకొచ్చాడు.
డినో చెప్పింది విన్నాక.. పఠాన్ లో జాన్ అబ్రహం పాత్రకు ఈ పాత్రకు పెద్ద తేడా లేదనిపిస్తుంది. ఇదే విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావిస్తే.. ”నిజమే.. పఠాన్ కూడా ముగ్గురు ఏజెంట్స్ కథే, కానీ షూటింగ్ మేము ముందు మొదలుపెట్టాం. కథ దాని కంటే ముందే తయారైయింది. పాత్రలో పోలిక ఉండొచ్చు ఏమో కానీ కథ పూర్తిగా భిన్నం” అన్నాడు.
నిజానికి స్పై కథలన్నీ దాదాపు ఒక లైన్ లో వుంటాయి. అయితే తనకు జరిగిన అన్యాయం కారణంగా ఈవిల్ గా మారిపోయే పాత్ర ఇటివలే పఠాన్ లోనే కనిపించింది. ఆ విషయంలో పోలిక రావచ్చు. అయితే దాన్ని విడుదల తర్వాత చెప్పడం కంటే ముందే చెప్పయడం మంచిదని భావించి వుంటారు. అందుకే ముందు జాగ్రత్తగా తన పాత్ర గురించి రివిల్ చేశారు. ఇది ఒక విధంగా మంచిదే. ప్రేక్షకులకు ముందే ఒక అంచనా వుంటుంది. లేదా అదేదో పెద్ద ట్విస్ట్ లా రివిల్ చేస్తే.. పఠాన్ తో ముడిపెట్టి విమర్శ చేసే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.