ఖరీదైన నజరానా భారంగా మారడం అంటే ఇదే. రియో ఒలింపిక్స్ లో త్రుటిలో పతకాన్ని చేజార్చుకున్న జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ తనకు సచిన్ టెండుల్కర్ బహుమతిగా ఇచ్చిన కారును తిరిగి ఇచ్చేస్తుందట. పతకం గెలవకపోయినా, దీపను చాలా మంది మెచ్చుకున్నారు. దీంతో ఒలింపిక్ పతక విజేతలు పీవీ సింధు, సాక్షి మాలిక్ తో పాటు దీపకు కూడా సచిన్ హైదరాబాద్ లో బీ ఎం డబ్ల్యు కారును బహూకరించాడు.
త్రిపురలోని అగర్తలకు చెందిన దీప, ఆ కారు మెయింటెనెన్స్ కష్టమని బాధపడుతోంది. అసలు అగర్తలో ఇంత పోష్ కారు సర్విస్ సెంటర్ లేదట. రోడ్లు కూడా అంత గొప్పగా ఉండవు. ఇలాంటి లగ్జరీ కారులో తిరగాలంటే హైవేలాంటి రోడ్లుండాలి. పైగా మొత్తం మీద కారు మెయింటెనెన్స్ భారం. దానిపై ఖర్చు ఎక్కువ. మైలేజీ తక్కువ.
త్వరలోనే జర్మనీలో జరిగే చాలెంజర్స్ కప్ పోటీల్లో పాల్గొనడానికి దీప సిద్ధమవుతోంది. ఈ కారు మెయింటెనెన్స్ కు డబ్బును, సమయాన్ని ఖర్చుచేసేస్తే కష్టమని ఆమె కుటుంబ సభ్యులు, కోచ్ చెప్పారట. దీంతో కారును వాపస్ ఇవ్వాలని దీప నిర్ణయించుకుంది.
దీప కోచ్ బిశ్వేశ్వర్ నంది ఈ విషయాన్ని నిర్ధారించారు. ఇది దీపతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, తాను కలిసి తీసుకున్న నిర్ణయమని చెప్పారు. ఆ కారు మెయింటెనెన్స్ తలకు మించిన భారంగా మారిందని తెలిపాడు. మొత్తానికి ఈ భారం వదిలించుకుని జిమ్నాస్టిక్స్ పై దృష్టి పెట్టాలని దీపా కర్మాకర్ గట్టి నిర్ణయానికి వచ్చిందట. అంటే ఇక ముందు అగర్తలలో ఈ ఖరీదైన కారు కనిపించదన్న మాట.