ఇద్దరు నేపాలీ మహిళలపై అత్యాచారం చేసిన భారత్ లోని తన దౌత్యవేత్త మజిద్ హస్సన్ అషుర్ ని సౌదీఅరేబియా ప్రభుత్వం స్వదేశానికి రప్పించుకొంది. అతను ఇంత కాలం డిల్లీలో సౌదీ ఎంబసీలో ఫస్ట్ సెక్రెటరీగా పనిచేసాడు. అతను డిల్లీలో పనిచేస్తున్న సమయంలో అతని ఇంట్లో పనిచేస్తున్న ఇద్దరు నేపాలీ మహిళా పనిమనుషులపై నిత్యం అత్యాచారం చేస్తుండేవాడు. తను వారిపై అత్యాచారం చేయడమే కాకుండా తన ఇంటికి వచ్చే స్నేహితుల చేత కూడా వారిని అత్యాచారం చేయించేవాడు. వారిపై రోజూ అత్యాచారం చేస్తూ వారికి తిండి కూడా పెట్టకుండా ఇంటిపనులు కూడా చేయించుకొనేవాడు. ఆ నేపాలీ మహిళలు ఇద్దరు ఒక స్వచ్చంద సంస్థ సహాయంతో తప్పించుకొని గుర్ గావ్ క్రైం పోలీస్ స్టేషన్లో అతనిపై పిర్యాదు చేసారు. దౌత్యవేత్తగా అతనికి ప్రత్యేక రక్షణ ఉన్న కారణంగా పోలీసులు అతనిని అరెస్ట్ చేయలేకపోయారు. తీవ్ర నేరాలకు పాల్పడిన అతనిని అరెస్ట్ చేసి విచారించేందుకు అతనికి గల దౌత్య రక్షణను ఉపసంహరించుకోవలసిందిగా భారత విదేశాంగశాఖ సౌదీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కానీ భారత్ విజ్ఞప్తిని త్రోసిపుచ్చి తన దౌత్యవేత్తను తిరిగి స్వదేశానికి రప్పించుకొంది. చిన్న చిన్న నేరాలకు పాల్పడేవారిని కూడా అతి కఠినంగా శిక్షించే సౌదీ అరేబియా ప్రభుత్వం, ఇటువంటి హేయమయిన నేరానికి పాల్పడిన తన దౌత్యవేత్తకు మినహాయింపు ఇవ్వడం, అతన్ని కాపాడుకొనేందుకు హడావుడిగా స్వదేశానికి రప్పించుకోవడం చాలా శోచనీయం.