దర్శకుడిగా వర్మ పేరు పడిన సినిమాలన్నిటికీ అతనే దర్శకత్వం చేశాడనుకుంటే పొరబాటు. వర్మ కంపెనీలో పనిచేసే సహాయ దర్శకులు దర్శకత్వం చేసుండొచ్చు. వర్మ సినిమా విడుదలైన ప్రతిసారీ అతని స్థాయికి తగ్గట్టు తీయలేదని ప్రేక్షకుల నుంచి ఓ మాట వినిపిస్తుంటుంది. వర్మ శిష్యుడు అజయ్ భూపతి మాటలు వింటే… వర్మ దర్శకత్వం చేయనప్పుడు అతని స్థాయికి తగ్గట్టు ఎలా వుంటుందని అనుకోక తప్పదు. ఈ జూలై 12న విడుదలవుతోన్న ‘ఆర్ఎక్స్100’తో ఈ కోనసీమ కుర్రాడు దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వర్మ దగ్గర ‘ఎటాక్’, ‘కిల్లింగ్ వీరప్పన్’, ‘వంగవీటి’ సినిమాలకు ఇతను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేశాడు. మీడియాతో మామూలుగా మాట్లాడుతూ గురువును ఆకాశానికి ఎత్తేసే క్రమంలో అసలు గుట్టు చెప్పేశాడు. ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమాలో వీరప్పన్ ఇంట్రడక్షన్ షాట్ అతనే డైరెక్ట్ చేశానని తెలిపాడు. మొదట రెండుసార్లు వేరే విధంగా తీశానవి వర్మకు నచ్చలేదని, మూడోసారి తీసినది చూసి ఒకే చేశారని చెప్పుకొచ్చాడు. అసిస్టెంట్లకు ఈవిధంగా కీలక సన్నివేశాలు తీసే బాధ్యత ఇవ్వడం వలన వారిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుందని త్వరగా దర్శకులు అవుతారని వర్మ గురించి బోలెడు కబుర్లు చెప్పాడు అజయ్ భూపతి. అక్కడున్న మీడియాకి మాత్రం ఓ విషయం అర్థమైంది. కొంతకాలంగా వర్మ సినిమాలు ఎందుకు ఆడటం లేదని! ఏమాటకామాటే చెప్పుకోవాలి… అజయ్ భూపతి తీసిన ‘ఆర్ఎక్స్100’ ట్రైలర్ వర్మ సినిమాల ట్రైలర్స్ కంటే బాగుంది. సినిమా ఎలా వుంటుందో?