మనోజ్ మంచు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’. పూర్తయి… చాలా కాలం స్థబ్దుగా ఉన్న ఈ సినిమా ఇప్పుడు రిలీజ్‌కు రెడీ అవుతోంది. ట్రైలర్లు ఆసక్తిని రేకెత్తిస్తున్నా… ఈ సినిమా ఎంత వరకూ జనాలకు రీచ్ అవుతుందన్నది పాయింట్. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. దర్శకుడు అజయ్ ఆండ్రూస్ ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర పోషించాడు. దర్శకులే తెరపైనా కనిపించడం కొత్త కాదు. కాకపోతే.. మనోజ్‌కి ధీటైన పాత్ర ఇదని తెలుస్తుంది. మనోజ్ కి సమానంగా అజయ్ పాత్ర కూడా ఉండబోతోందని, ఓ దశలో ఈ సినిమాలో హీరో మనోజా?? అజయ్నా?? అనే అనుమానాలూ కలగడం సహజమని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఎడిట్ రూమ్‌లో అజయ్‌పై తెరకెక్కించిన సీన్లకు కత్తెర్లు పడ్డాయని టాక్.
అయితే ఈ సినిమా సెన్సార్ గండాన్ని దాటుకొని వస్తుందా అనేది ఇప్పుడు మొలకెత్తుతున్న కొత్త అనుమానం. ఎల్ టీ టీ ఈ, ప్రభాకరన్.. నేపథ్యంలో సాగే కథ ఇది. భావజాలాల దృష్టి కోణంలో చూసినా… ప్రభుత్వాలపై కొన్ని సెటైర్లు వినిపించే అవకాశం ఉంది. పైగా ఎల్ టీ టీ ఈ అనేది ఇప్పటికీ సున్నితమైన విషయమే. గత కొంతకాలంగా సెన్సార్ నియమాలు కఠినమవుతూ వస్తున్నాయి. సున్నితమైన అంశాల్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఈనేపథ్యంలో మనోజ్ సినిమాకీ సెన్సార్ గండం తప్పేట్టు లేదు.