ప్రతీ దర్శకుడికీ తన సినిమాపై నమ్మకం ఉంటుంది. `మా సినిమా బాగుంటుంది.. తప్పకుండా చూడండి` అని చెప్పుకోవడం చాలా చాలా సహజం. వాళ్లు నమ్మకపోతే సినిమాని ఎవరు నమ్ముతారు? అయితే అజయ్ భూపతి స్టైల్ వేరు. తన సినిమాపై తనకు మరింత ఎక్కువ నమ్మకం. `ఆర్.ఎక్స్ 100` సమయంలో… `రాసి పెట్టుకోండి ఈ సినిమా హిట్టు` అని విడుదలకు ముందే చెప్పాడు. అప్పుడు అజయ్ భూపతి ఎవరో తెలీదు. అందులో నటించిన కార్తీకేయ ఎవడో తెలీదు.అదంతా ఓవర్ కాన్ఫిడెన్స్‌గా కనిపించింది. కానీ అనూహ్యంగా ఆ మాటే నిజమై.. ఆర్.ఎక్స్ 100 హిట్టయ్యింది. ఇప్పుడు తన రెండో సినిమాగా `మహా సముద్రం`ని తీసుకొచ్చాడు. ఈనెల 14న ఈ సినిమా రిలీజ్. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో.. సేమ్ టూ సేమ్ `ఆర్.ఎక్స్ 100` నాటి కాన్ఫిడెన్స్నే చూపించాడు అజయ్.
”రాసి పెట్టుకోండి. ఈసినిమా బ్లాక్ బ్లస్టర్ హిట్. పోస్టర్లు కూడా రెడీ చేసేసుకోండి” అంటూ ప్రకటించేశాడు. ”ఆర్.ఎక్స్ 100 సమయంలో నేను ఇలానే మాట్లాడాను. అప్పుడు నాది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నారు. కానీ హిట్టు చేసి చూపించాను. ఇప్పుడూ అదే మాట చెబుతున్నాను. 14న రిలీజ్ అవుతున్న నా సినిమా బ్లాక్ బ్లస్టర్ హిట్టు. నా సినిమాపై నాకు అంత నమ్మకం. ఈ సినిమా చూశాక ప్రేక్షకులూ అదే మాట చెబుతారు” అంటూ.. తన నమ్మకాన్ని మరోసారి భారీ స్థాయిలో వ్యక్త పరిచాడు. చెప్పి మరీ హిట్టు కొట్టడం మామూలు విషయం కాదు. మహా సముద్రం విషయంలో అజయ్ భూపతి మాటే నిజమైతే – మూడో సినిమా నుంచి… భూపతి స్టార్ డైరెక్టర్ అయిపోవడం ఖాయం.