వాల్తేరు వీరయ్యతో రెండేళ్ల క్రితం సంక్రాంతి పండక్కి బాక్సాఫీస్ షేక్ చేశాడు బాబీ. ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో `డాకూ మహారాజ్` రూపొందించాడు. ఈ సినిమా కూడా సంక్రాంతికే విడుదల అవుతోంది. బాబీ తదుపరి సినిమాలు కూడా స్టార్ హీరోలతోనే. ఇప్పటికే చిరంజీవి – బాబీ కాంబోలో మరో సినిమా మొదలవుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. రజనీకాంత్ తో కూడా బాబీ ఓ సినిమా చేస్తాడని ఇది వరకు చెప్పుకొన్నారు. ఈ రెండు ప్రాజెక్టుల గురించి తెలుగు 360తో మనసు విప్పాడు బాబీ.
రజనీకాంత్ ని కలిసి కథ చెప్పిన మాట నిజమే అని, ఆ ప్రాజెక్ట్ త్వరలోనే ఉంటుందని చెప్పుకొచ్చాడు బాబీ. అంతే కాదు… చిరంజీవితోనూ ఓ సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ రెండు సినిమాల్లో ఏది ముందు? ఏది వెనుక? అనే విషయాలు స్పష్టం చేయలేదు. ”నేను పని చేసిన హీరోలందరూ మంచివాళ్లే. వాళ్లతో మళ్లీ మళ్లీ పనిచేయాలని వుంది. రవితేజ, వెంకటేష్, నాగచైతన్య.. వీళ్లందరితోనూ రిపీట్ గా వర్క్ చేస్తా” అని చెప్పుకొచ్చాడు.
చిరంజీవితో తన అనుబంధం ప్రత్యేకమైనదని, `డాకూ మహారాజ్` టీజర్ రాగానే… తనకు ఫోన్ చేసి, అభినందించారని ఖుషీ అయిపోతున్నాడు బాబీ. `డాకూ మహారాజ్`పై గట్టి అంచనాలు ఉన్నాయి. ఆమధ్య విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. పాటలు రెండూ ఇన్స్టెంట్ గా హిట్టయిపోయాయి. ఇక ట్రైలర్ వదలడమే తరువాయి. జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.