హిట్టు కొట్టిన దర్శకుడ్ని పట్టుకోవడం అంత సులభం కాదు. మార్నింగ్ షో అవ్వగానే.. తానూ `అడ్వాన్స్ బుకింగ్` అయిపోతాడు. ముందు చూపున్న వాళ్లు అంతకంటే ముందే కర్చీఫ్ వేసి తమ వైపుకు లాగేసుకుంటుంటారు. హీరోలు, నిర్మాతలూ… ఎలాంటి సినిమాలొస్తున్నాయి, వాటి బజ్ ఏంటి? అనేది బాగా ఆరా తీసి, సదరు దర్శకుడ్ని ముందే లైన్ లో పెట్టుకుంటుంటారు. అలా.. ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న దర్శకుడు బుచ్చిబాబు.
ఈ సుకుమార్ శిష్యుడి అరంగేట్ర చిత్రం `ఉప్పెన`. ఇప్పటికైతే ఈసినిమాపై సూపర్బజ్ ఉంది. పాటలు హోరెత్తిపోతున్నాయి. ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంది. సినిమా రిలీజ్ అయి `ఓకే` అనిపించుకున్నా, మంచి వసూళ్లే అందుకోగలదు. అందుకే బుచ్చిబాబుని లైన్ లో పెట్టడానికి చాలామంది నిర్మాతలు, హీరోలూ రెడీ అయిపోయారు. ఇప్పటికే మైత్రీ మూవీస్ రెండో సినిమా కూడా తమకే చేయాలని ఒప్పందం చేసుకుంది. హారిక హాసిని, డీవీవీ దానయ్య.. లాంటి వాళ్లు కూడా బుచ్చిబాబుకి టచ్లోకి వెళ్లారని టాక్. నితిన్, నాని లాంటి యంగ్ హీరోలు బుచ్చితో సినిమాలు చేయడానికి రెడీ అంటున్నార్ట. సాయి ధరమ్ తేజ్ కూడా.. `నాకో కథ చెప్పు` అని అడిగాడని టాక్. సినిమా ఎలా ఉన్నా, అవకాశం ఇవ్వడానికి ఓ యంగ్ హీరో తెగ ఉత్సాహపడిపోతున్నాడని తెలుస్తోంది. మొత్తానికి ఇప్పుడు అందరి దృష్టి ఈ కుర్ర దర్శకుడిపై పడింది. ఆ ఫోకస్ పెరుగుతుందా? లేదంటే చప్పున మాయం అయిపోతుందా అనేది 12 న తేలిపోతుంది.