రాజకీయ నాయకులకు కాస్త అవకాశం దొరికితే ఆగరు. పైగా తమ నాయక భక్తి నిరూపించుకునే సందర్భం అయితే ఇక వారిని నిలువరించడం దాదాపు అసాధ్యం. అలాంటి పరిస్థితుల్లోనే ఒక్కోసారి నోరు జారి నిజం మాట్లాడేస్తుంటారు. ఇరుకున పడుతుంటారు. అదే జరిగింది తమిళనాడుకు చెందిన భాజాపా నేత హెచ్. రాజా విషయంలో.
తాజాగా విజయ్ సినిమా మెర్సల్ కు సంబంధించిన వివాదంలో ఇదంతా తమ నేత మోడీకి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర అంటూ వ్యాఖ్యానిస్తూ మాట్లాడిన రాజా… ఆ సినిమాకు సంబంధించి నటీనటులు, నిర్మాతపై రకరకాల విమర్శలకు దిగిన విషయం విదితమే. అదే క్రమంలో ఆయన ఆ సినిమాను తాను చూశానన్నారు. అంత వరకూ బానే ఉంది కానీ… ఆ సినిమాను ఇంటర్నెట్లో చూశాను అనడమే ఆయన ఆవేశంలో నోరుజారి చేసిన తప్పు.
దీన్ని తమిళ హీరో, తమిళ నిర్మాతల మండలి జనరల్ సెక్రటరీ కూడా అయిన విశాల్ ఠక్కున పట్టుకున్నాడు. భాజాపా పార్టీకి చెందిన అగ్రనేత అలా బహిరంగంగా తాను పైరసీ సినిమా చూశానంటూ చెప్పడం దేనికి ఉదాహరణగా నిలుస్తుందంటూ విశాల్ సూటిగా ప్రశ్నించాడు. తన లాంటి సామాన్య వ్యక్తే ఏదైనా పని చేసేటప్పుడే తప్పా ఒప్పా అని ఒకటికి పదిసార్లు ఆలోచిస్తానని, అలాంటిది అంత ప్రముఖులై ఉండీ మీరీ పని చేయడం ఏమిటని నిలదీశాడు. చట్టాలు అమలు చేయడంలో ముందుండాల్సిన ప్రజా ప్రతినిధి అయి ఉండీ ఇలా చేయడం అంటే సామాన్య ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపడం కాదా? అని ఆవేదన వెలిబుచ్చాడు.