మరి కొద్ది గంటల్లో ‘యశోద’ భవితవ్యం తేలిపోతుంది. సమంత చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ఇది. అనారోగ్యంతో.. ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొనలేకపోయింది సమంత. ఓ వీడియో ఇంటర్వ్యూ చేసి వదిలినా.. పెద్దగా ఉపయోగపడలేదు. ఇదంతా.. రేపు ఓపెనింగ్స్ పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందా? అని మరోవైపు గుణ శేఖర్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘శాకుంతలమ్లో’నూ తనే హీరోయిన్. కేవలం సమంత ఇమేజ్‌ని నమ్ముకొని తీసిన సినిమాలు ‘యశోద’, ‘శాకుంతలమ్’. ఈ సినిమాలో ఉన్న ఏకైక స్టార్ సమంత మాత్రమే. సమంతని చూసి జనాలు థియేటర్లకు వస్తారా, రారా అనేది ‘యశోద’తో తేలిపోతుంది.
‘యశోద’తో పోలిస్తే.. ‘శాకుంతలమ్’కి భారీ బడ్జెట్ అయ్యింది. గుణశేఖర్ స్వతహాగానే… మేకింగ్ పై దృష్టి పెడుతుంటాడు. శాకుంతలమ్ లో విజువల్స్‌కి ప్రాధాన్యం ఉంది. ఈ సినిమాకి దాదాపుగా రూ.70 కోట్లయినట్టు టాక్. ‘యశోద’ కూడా అటూ ఇటూగా రూ.30 కోట్ల సినిమానే. సమంత నటించిన ‘యూ టర్న్’కి మంచి రిపోర్ట్ వచ్చినా – బాక్సాఫీసు దగ్గర ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయింది. ‘ఓ బేబీ’ బొటాబొటీ కలక్షన్లతో గట్టెక్కింది. ఇలాంటి పరిస్థితుల్లో ‘యశోద’ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘యశోద’ కలక్షన్లు ఏమాత్రం బాగున్నా.. పరోక్షంగా శాకుంతలమ్ సినిమాకి హెల్ప్ అవుతుంది. అందుకే.. గుణశేఖర్ దృష్టంతా.. యశోదపై ఉంది.