గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `హిరణ్య`. గత రెండేళ్ల నుంచీ ఈ స్క్రిప్టు పనుల్లో తలమునకలైపోయారు గుణశేఖర్. సురేష్‌బాబు ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని భావిస్తున్నారు. బడ్జెట్ కూడా ఎక్కువే. దాదాపు 200 నుంచి 250 కోట్ల వరకూ ఖర్చవుతుందని ఓ అంచనా. అయితే ఇంత భారీ బడ్జెట్ సినిమా తీయడానికి సురేష్ బాబుకి ధైర్యం చాలడం లేదు. దాన్ని తిరిగి రాబట్టుకోగలిగే సత్తా రానాకి ఉందా, లేదా? అనే మీమాంస ఆయన్ని లాగుతోంది. అయితే… ప్రాజెక్టుపై మమకారంతో ఆయన రంగంలోకి దిగారు. బడ్జెట్ విషయంలో రిస్క్ ఉంది కాబట్టి, ఇప్పుడీ సినిమాని ఓ అంతర్జాతీయ సంస్థ చేతిలో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
20 th ఫాక్స్ స్టూడియోతో అనుసంధానమై ఈచిత్రాన్ని నిర్మించబోతున్నారు సురేష్ బాబు. ప్రొడక్షన్ మొత్తం సురేష్ బాబు చూసుకునేలా, పెట్టుబడిలో కొంత భాగం ఫాక్స్ పెట్టేలా ఒప్పందాలు జరిగాయని సమాచారం. ఈ చిత్రాన్ని హిందీలో కరణ్ జోహార్ విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మొత్తానికి బ్యాక్ గ్రౌండ్ సెటప్ మాత్రం పటిష్టంగానే కనిపిస్తోంది. గుణశేఖర్ కూడా ఈ స్క్రిప్టు విషయమై చాలా కసరత్తులు చేస్తున్నాడు. 2019 మార్చి లేదా ఏప్రిల్ లో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్సుంది.