‘మా సినిమా తోపు… తురుము’ అని రిలీజ్ కు ముందు చాలా చాలానే చెబుతుంటాయి చిత్రబృందాలు. ఎవరి బిడ్డ వాళ్లకు గొప్పగానే కనిపిస్తుంది. సినిమాని వాళ్లు అంతగా నమ్మకపోతే – థియేటర్లకు ప్రేక్షకులు వెళ్లేలా మోటివేట్ చేయలేరు. అందుకే మా సినిమా అద్భుతంగా వచ్చింది, సూపర్ హిట్ కొట్టడం ఖాయం అని చెబుతుంటారు. అయితే అక్కడక్కడ, అప్పుడప్పుడూ కొన్ని శ్రుతిమించిన స్టేట్మెంట్లూ వినిపిస్తుంటాయి. ‘ఇదేంటి.. కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ గా కనిపిస్తోంది’ అంటూ మిగిలిన వాళ్లు ఆశ్చర్యపోతుంటారు. హసిత్ గోలీ కామెంట్లు అలానే అనిపిస్తున్నాయి. ‘రాజ రాజ చోర’తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు హసిత్. ఇప్పుడు అదే శ్రీవిష్ణుతో ‘శ్వాగ్’ సినిమా తీశాడు. ఈనెల 4న వస్తోంది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కాస్త గట్టిగానే మాట్లాడాడు హసిత్. 2024లో చూసిన బెస్ట్ ఇంట్రవెల్ సీన్, బెస్ట్ క్లైమాక్స్, బెస్ట్ మూవీ ఇదేనని, రాబోయే కొన్నేళ్ల పాటు ఈ సినిమా మాట్లాడుతూనే ఉంటుందని స్టేట్మెంట్ పాస్ చేశాడు. నిజానికి ఇది చాలా పెద్ద మాట. ఇంట్రవెల్ ట్విస్టు బాగుంటుంది, క్లైమాక్స్ గుర్తుండిపోతుందని చెప్పడం వరకూ ఓకే. కానీ 2024లోనే ది బెస్ట్ ఇంట్రవెల్, ది బెస్ట్ క్లైమాక్స్, ది బెస్ట్ ఫిల్మ్ తీశానని చెప్పడం మాత్రం కాస్త అతిగా అనిపిస్తుంది. అయితే ఇవన్నీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో చెప్పిన మాటలు కాదని, సినిమాని ఒకటికి 10సార్లు చూసుకొని చెప్పిన మాట అని, ఈ సినిమాని ప్రేక్షకులకు ఎప్పుడెప్పుడు చూపిస్తానా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని, సినిమా చూశాక ప్రేక్షకులూ ఇదే చెబుతారని ఢంకా బజాయించి మరీ చెబుతున్నాడు హసిత్. సినిమా హిట్టయి, నిజంగా ఇంట్రవెల్, క్లైమాక్స్ కిక్ ఇస్తే సరే, కానీ అటూ ఇటూ అయితే మాత్రం ట్రోలింగ్ మామూలుగా ఉండదు. ”ఇప్పుడు చూస్తున్నది మీరు ఇంతకు ముందెప్పుడూ చూడనిది” అంటూ ‘శక్తి’ సమయంలో మెహర్ రమేష్ కొట్టిన డప్పు ఇప్పటికీ… ట్రోలర్స్ గుర్తు చేస్తూనే ఉంటారు. ఆ ప్రమాదం రాకుండా చూసుకొంటే మంచిది.