అతనో టాలీవుడ్ లో పేరు మోసిన దర్శకుడు. మాస్ సినిమాల్ని బాగా తీస్తాడని పేరు. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో తనదైన మార్క్ వుంది. తన ఖాతాలో సూపర్ హిట్లున్నాయి. అయితే.. కాస్త నోటి దురద. దాంతోనే చాలామందికి దూరం అవుతున్నాడు. తన తొలి సినిమా నుంచీ.. తన తో పాటు పని చేస్తున్న ఫైట్ మాస్టర్ని తక్కువ చేసి మాట్లాడడం వల్ల.. తన తాజా సినిమా నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయాడాయ. `టైటిల్స్ లో వాళ్ల పేర్లు పడుతున్నాయంతే.. అంతా చేయించేది నేనే` అన్నట్టు మాట్లాడడంతో ఆ ఫైట్ మాస్టర్స్ హర్టయ్యారు. వందల సినిమాలు చేసి, తమదంటూ ఓ బ్రాండ్ సంపాదించిన ఫైట్ మాస్టర్స్ గురించి ఎవరైనా ఇలా మాట్లాడతారా? అందుకే టీమ్ నుంచి వాళ్లు వెళ్లిపోయారు.
ఇప్పుడు అదే టీమ్ నుంచి కొంతమంది రైటర్లు, అసిస్టెంట్లు, అసోసియేట్లు కూడా దూరం అయ్యారని తెలుస్తోంది. తమకు రావాల్సిన క్రిడెట్ ఆ దర్శకుడు ఇవ్వడం లేదని, పైగా… అందరి ముందూ బూతులు తిడుతున్నాడన్నది వాళ్ల ఆరోపణ.అయినా ఆ డైరెక్టర్ ఇవేం పట్టించుకోవడం లేదట. `మీరు పోతే వంద మంది` అంటూ… వెళ్తున్న వాళ్లని వెళ్తున్నట్టే సాగనంపుతున్నాడట. ఇంతకు ముందు కూడా ఈ స్థానంలో పనిచేసిన ఓ రైటర్ ఇలానే అలిగి వెళ్లిపోయాడు. మరో రైటర్… తన పై కోపంతోనే దర్శకుడిగా మారాడు. ప్రతిభ ఎవరికైనా ఉండొచ్చు. అక్కడే వినయం కూడా ఉండాలి. అప్పుడే ప్రతిభ మరింత ప్రకాశిస్తుంది. ఈ విషయం ఆ దర్శకుడు ఎప్పుడు తెలుసుకుంటాడో?