MAD సినిమాతో ఆకట్టుకొన్న దర్శకుడు కల్యాణ్ శంకర్. ఆ సినిమా పెద్ద హిట్టయ్యింది. అందుకే ఇప్పుడు MAD స్వ్కేర్ కూడా చేసేశారు. వచ్చేవారం విడుదల అవుతోంది. ఈ సినిమాపై కూడా మంచి బజ్ వుంది. మినిమం గ్యారెంటీ సినిమా అన్నది అందరి నమ్మకం. కాబట్టి… మూడో సినిమా కోసం కూడా ప్రయత్నాలు మొదలైపోయాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలోనే మూడో సినిమా చేస్తున్నాడని, ఈసారి రవితేజ కోసం కథ సిద్ధం చేశారని టాలీవుడ్ లో టాక్. అది నిజమే. కల్యాణ్ రవితేజ కోసం ఓ కథ రెడీ చేశారు. వినిపించేశారు కూడా. ఇది సూపర్ హీరో కథ. దానికి యాక్షన్, ఎంటర్ట్న్మెంట్ జోడించారు. రవితేజ సూపర్ హీరో లాంటి కథని సెలెక్ట్ చేయడం ఇదే తొలిసారి. ఈమధ్య టాలీవుడ్ లో సూపర్ హీరో కథలపై మోజు పెరిగింది. ‘హనుమాన్’ అలాంటి సినిమానే. అది పెద్ద హిట్. తేజా సజ్జా చేస్తున్న `మిరాయ్` కూడా సూపర్ హీరో టైపు కథే. ఇప్పుడు రవితేజ కూడా ఇదే జోనర్ పట్టుకొన్నాడు.
2026 సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయాలన్నది ముందుస్తు ప్లాన్. కాకపోతే.. అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ప్రీ ప్రొడక్షన్‌కి చాలా సమయం పడుతుందని, ఆగస్టులోగా సినిమా పట్టాలెక్కడం కుదరని పని అని తెలుస్తోంది. మేకింగ్ కి కనీసం 10 నెలల సమయం పట్టినా – 2026 చివర్లో గానీ రవితేజ సినిమా విడుదల అవ్వదు. ప్రస్తుతం ‘మాస్ జాతర’ సినిమా చేస్తున్నారు రవితేజ. ఆ సినిమా కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ లోనే నడుస్తోంది. ఆ వెంటనే అదే బ్యానర్లో మరో సినిమా ఫిక్సయ్యారన్నమాట. దీంతో పాటుగా..’అనార్కలి’ అనే మరో కథకు సిగ్నల్ ఇచ్చారు రవితేజ. కిషోర్ తిరుమల దర్శకుడు. అన్నీ కుదిరితే.. ఈ సినిమా 2026 సంక్రాంతికి రావొచ్చు.