ఏ ముహూర్తంలో మొదలెట్టారో కానీ… హరిహర వీరమల్లుకి అన్నీ ఆటంకాలే. ఓ అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది ఈ సినిమా పరిస్థితి. ఎందుకనో.. ఈ సినిమా పూర్తి చేయడానికి పవన్ ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. యేడాదికి రెండు సినిమాలు ఈజీగా చేసేసే క్రిష్.. రెండేళ్లుగా ఇదే ప్రాజెక్టుతో సతమతమవుతున్నాడు. పవన్ ఏమో.. ఈ సినిమా తప్ప, మిగిలిన సినిమాల్ననీ పూర్తి చేస్తున్నాడు. ఈలోగా ఈ సినిమాపై కొత్త కొత్త రూమర్లు పుట్టుకొస్తున్నాయి. ఈ ప్రాజెక్టు నుంచి క్రిష్ తప్పుకొన్నాడని, మరో దర్శకుడు టేకాఫ్ చేయబోతున్నాడన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్.
ఇప్పటికే సగం సినిమా పూర్తయింది. ఇలాంటి పరిస్థితుల్లో క్రిష్ ఈ సినిమాని వదులుకోడు. పైగా ఈ కథ పూర్తిగా తనది. తన ఆలోచనల్లోంచి పుట్టిన కథ. సగం సినిమా మరొకరికి అప్పగిస్తే మొదటికే మోసం వస్తుంది. ఒకవేళ సినిమా హిట్టయినా ఆ పేరు.. తన ఖాతాలో పడదు. ఫ్లాప్ అయితే.. ఇదంతా క్రిష్ వల్లే అనేస్తారు. అందుకే ఆ భారమేదో తానే మోయాలనుకొంటున్నట్టు తెలుస్తోంది. అయితే.. పవన్ వచ్చేంత వరకూ తనకు ఖాళీగా ఉండడం ఇష్టం లేదు. అందుకే ఈలోగా మరో కథ రెడీ చేసుకొంటున్నాడని సమాచారం. అన్నీ కుదిరితే.. ఆ సినిమాని సైతం మొదలెట్టాలని చూస్తున్నాడట. పవన్ బల్క్ గా డేట్లు ఎప్పుడు ఇస్తే అప్పుడే `వీరమల్లు` మొదలెడతానని, అంత వరకూ మరో సినిమా చేసుకొంటానని నిర్మాతకు కూడా క్లారిటీగా చెప్పినట్టు టాక్. అంటే… వీరమల్లుని తాత్కాలికంగా పక్కన పెట్టి, క్రిష్ మరో సినిమా మొదలెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నమాట.