క్రిష్ ది విచిత్రమైన పరిస్థితి. గత యేడాదిగా ఒక్క రోజు కూడా క్రిష్ ఖాళీగా లేడు. మణికర్ణిక షూటింగఠ్ పూర్తవ్వకుండానే.. ఎన్టీఆర్ బయోపిక్‌లో తలమునకలయ్యాడు. కేవలం వంద రోజుల్లో రెండు భాగాలు తెరకెక్కించే పనిలో… రాత్రీంబవళ్లూ కష్టపడ్డాడు. ఒక్క యేడాది మూడు సినిమాలు (మణికర్ణిక, ఎన్టీఆర్ రెండు భాగాలు) చేసినా – ఆర్థికంగా మాత్రం క్రిష్ ఏమాత్రం సంతృప్తిగా లేడు.
కారణం… ‘మణికర్ణిక’ టీమ్ నుంచి క్రిష్‌కి ఇంకా పారితోషికం అందలేదు. ఇస్తామన్న మొత్తంలో కేవలం 30 శాతం మాత్రమే ఇచ్చారు. మిగిలిన మొత్తం అడిగితే.. మణికర్ణిక చిత్రబృందం నుంచి ఎలాంటి స్పందనా రావడం లేదు. మణికర్ణిక పోస్ట్ ప్రొడక్షన్ స్థితిలో ఉన్నప్పుడు క్రిష్ ఆ టీమ్ నుంచి బయటకు వచ్చేయడం, మిగిలిన భాగాన్ని కంగనా తన దర్శకత్వంలో తెరకెక్కించుకోవడంతో – దర్శకుడిగా క్రిష్‌కు ఇవ్వాల్సిన పారితోషికాన్ని ఎగ్గొట్టడానికి మణికర్ణిక నిర్మాతలకు ఓ ఆయుధం దొరికినట్టైంది.
మరోవైపు ఎన్టీఆర్ నుంచి కూడా క్రిష్‌కి పూర్తి స్థాయి పారితోషికం అందలేదు. సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించాలని అనుకోక ముందే… క్రిష్ పారితోషికం ‘ఇంత’ అని డిసైడ్ అయిపోయింది. ఆ మొత్తం మాత్రం క్రిష్ చేతికి అందింది. రెండు భాగాలుగ ఈ చిత్రాన్ని తీయాల్సివచ్చింది కాబట్టి, అనుకున్నదానికంటే ఎక్కువ రోజులు ఈ సినిమాకి పనిచేయాల్సివచ్చింది కాబట్టి.. పారితోషికం డబుల్ చేశారు. ఆ మేరకు పెరిగిన పారితోషికం క్రిష్ చేతికి ఇంకా అందలేదని సమాచారం. ‘కథానాయకుడు` చిత్రానికి భారీ నష్టాలు వచ్చిన నేపథ్యంలో, పంపిణీదారుకుల నష్ట పరిహారం చెల్లించాలని బాలయ్య డిసైడ్ అయ్యాడు. అందులో భాగంగా పార్ట్ 2ని దాదాపుగా ఉచితంగానే బయ్యర్లకు ఇచ్చేస్తున్నాడు. అంటే `మహా నాయకుడు` ద్వారా నిర్మాతగా బాలకృష్ణ ఆర్జించినదేం లేదన్నమాట. అందుకే క్రిష్ కూడా పెరిగిన పారితోషికాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నాడట. ఒప్పందాల ప్రకారం `మహానాయకుడు` తొలి కాపీ సిద్ధమయ్యే నాటికి క్రిష్ పారితోషికం పూర్తిగా చెల్లించేయాలి. కానీ.. క్రిష్ మాత్రం.. ‘అదనంగా పారితోషికం వద్దు.. ‘ అని బాలయ్యకు చెప్పినట్టు సమాచారం అందుతోంది. ఆరకంగా `ఎన్టీఆర్` నష్టాలు పూడ్చడానికి తాను సైతం ముందుకొచ్చాడన్నమాట. మొత్తానికి కంగనా దయ వల్ల `మణికర్ణిక` నుంచి అందాల్సిన మొత్తం క్రిష్‌కి రాలేదు. ఇప్పుడు ‘ఎన్టీఆర్’ విషయంలోనూ అదే జరిగింది.